AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
Ap Assembly Elections 2024: రాష్ట్రంలో ఓట్ల పండుగకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
LIVE

Background
కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత, బీజేపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టిడిపి ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు.
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఏపీ ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు వైఎస్సార్ సీపీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని ట్వీట్ చేశారు.
ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ - చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతం
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకుంది.
విజయవాడ పోరంకిలో తీవ్ర ఉద్రిక్తత
విజయవాడలోని పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా.. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. టీడీపీ తీరుపై వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కావలిలో ఉద్రిక్త పరిస్థితి
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయనే అనుమానంతో ఏఎంసీ మాజీ ఛైర్మన్ సుకుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుచరులతో వచ్చిన ఆయన.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

