Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
Andhra News: ఎన్నికల వేళ పోలీసులు విస్తృత సోదాల్లో భాగంగా భారీగా అక్రమ నగదు పట్టుకుంటున్నారు. ఏపీలో లారీలో రూ.8.40 కోట్లు పట్టుకోగా.. తెలంగాణలో కాలేజీ బ్యాగులో తరలిస్తోన్న రూ.53 లక్షలు సీజ్ చేశారు.
Money Seized In Ntr District: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా నగదు, అక్రమ మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట (Jaggaihhpeta) మండలం గరికపాడు (Garikapadu) చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ లారీలో రూ.8.40 కోట్లు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తోన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
#WATCH | Andhra Pradesh: NTR district police seized Rs 8 crores cash at the Garikapadu check post in NTR district. The money was discovered in a pipe-loaded lorry in a separate cabin and two individuals have been detained. The money was being transported from Hyderabad to Guntur.… pic.twitter.com/Sqmpq9EIdc
— ANI (@ANI) May 9, 2024
3 వేల గోవా మద్యం సీసాలు
అటు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో (Nandigama) భారీగా మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ శివారు డీవీఆర్ కాలనీ వద్ద గురువారం తెల్లవారుజామున అక్రమంగా రవాణా చేస్తోన్న 3 వేల గోవా మద్యం సీసాలను సీజ్ చేశారు. ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం సీసాలు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాపు చేసున్నటు పోలీసులు తెలిపారు.
తెలంగాణలో..
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోనూ పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ లో సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు భారీగా డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు.. అనుమానాస్పదంగా ఉన్న 2 యాక్టివా వాహనాలను పట్టుకున్నారు. లెక్కల్లో చూపని రూ.22 లక్షలు సీజ్ చేశారు. అలాగే, మేడ్చల్ పట్టణంలో SOT పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. SISCO సేఫ్ గార్డ్ వాహనంలో 5 సీల్డ్ బాక్సుల్లో దాదాపు రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అటు, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ దేవ్ హాస్పిటల్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా.. 4 కేజీల బంగారం, 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.66 కోట్ల పైచిలుకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాలేజీ బ్యాగులో..
అలాగే, కాలేజీ బ్యాగులో తరలిస్తోన్న దాదాపు రూ.53 లక్షల నగదును సైతం పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం SOT రాజేంద్రనగర్ టీం, KPHB పోలీసులు కూకట్పల్లిలోని వసంత్ నగర్ బస్ స్టాప్ అనుమానాస్పదంగా రెండు హీరో ప్యాషన్ ప్రో బైక్‌ల పై వచ్చిన వ్యక్తులను పట్టుకుని వారిని సోదా చేయగా.. కాలేజీ బ్యాగ్ లో రూ.53,37,500 లభ్యమయ్యాయి. దీన్ని హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్న నాగరాజు, అకౌంటెంట్ గా పనిచేస్తున్న ముసల నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు వారి యజమాని ఆదేశాల మేరకు బహదూర్‌పురా వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుని కూకట్పల్లిలోని వసంత్ నగర్ లో గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ కు చెరవేస్తున్న క్రమంలో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు బైక్స్ ఉపయోగిస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా విద్యార్థులు ఉపయోగించే షోల్డర్ బ్యాగ్ లో డబ్బును అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులతో కూడిన బైక్ కు వేరో బైక్ తో చెకింగ్ చేస్తూ పోలీసు చెకింగ్స్ గమనిస్తూ డబ్బును అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు విచారిస్తున్నారు.