Election Raids: ఎన్నికల వేళ తాయిళాల ప్రవాహం- హైదరాబాద్‌లో డబ్బు, సత్తెనపల్లిలో చీరలు, అనంతలో వాచ్‌లు సీజ్
Elections 2024: ఎన్నికల తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌లో రూ.17లక్షల హవాల డబ్బు సీజ్ చేశారు పోలీసులు. అటు... ఏపీలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో 5వేల చీరలు స్వాధీనం చేసుకున్నారు.
Election In Andrapradesh And Telangana: ఎన్నికలు సమీపిస్తుండటంతో నగదు ప్రవాహనం మొదలైపోయింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఎక్కడికక్కడ అక్రమ నగదును సీజ్ చేస్తున్నారు. అంతేకాదు... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీల అభ్యర్థులు దాచిన బహుమతులను కూడా గుర్తించి పట్టుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలీసులు... ప్రలోభాలకు చెక్ పెడుతున్నారు.
హైదరాబాద్‌లో రూ.17లక్షలు సీజ్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17లక్షల 40వేల 100 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్‌వోటీ (SOT) పోలీసులు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు వ్యక్తులు హవాలా డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో... పోలీసులు అలర్ట్ అయ్యారు. వారి వెళ్లే లబ్యాయ్ కాంటా ప్రాంతంలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్‌ను సోదా చేయగా... బైక్ డిక్కీలో నగదు బ్యాగ్ బయటపడింది. ఆ బ్యాగ్‌లో రూ.17,40,100 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు లేక. డబ్బు ఎవరిది... ఎక్కడిది...? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఎందుకు తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించగా... వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో డబ్బు సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డబ్బును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లోని మరో ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 30 లక్షల రూపాయలు పట్టుకున్నారు పోలీసులు.
సత్తెనపల్లిలో 5వేల చీరలు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓటర్లు ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారికి బహుమతులు ఇచ్చిన మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే... పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ప్రలోభాల పర్వానికి చెక్ పెడుతున్నారు. విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా చీరలు బయటపడ్డాయి. గోడౌన్‌లో చీరలు దాడిపెట్టారని అధికారులకు ముందస్తు సమాచారం అందింది. వెంటనే సత్తెనపల్లి పట్టణంలోని పారిశ్రామిక వాడలో ఉన్న ఓ గోడౌన్‌లో నిన్న (గురువారం) ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించారు. గొడౌన్‌కు తాళం వేసి ఉండడంతో నిర్వాహకుడికి ఎన్నికల అధికారులు పోన్ చేశారు. అతను స్పందించకపోవడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి తనిఖీ చేశారు.
సీఎం జగన్ బొమ్మ ఉన్న 114 అట్టపెట్టెల్లోని 5వేల 472 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఆ చీరలను సత్తెనపల్లి పట్టణ పోలీసులకు అప్పగించారు. మహిళా ఓటర్లకు ఈ చీరలను పంపిణీ చేసేందుకు నిల్వచేసినట్టు తెలుస్తోంది అధికారులు చెప్తున్నారు. బాక్సుల్లో చీరలు ఉంచి... ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం (ఈనెల 20న) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని దుకాణంలో 16వందల 80 చీరలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాతి రోజే సత్తెనపల్లిలోని గోడౌన్‌లో 5వేలకుపైగా చీరల బాక్సులు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే... 5వేలకుపైగా చీరలు తనవే అని.. .అమ్ముకునేందుకు గోడౌన్‌లో నిల్వ ఉంచామని సత్తెనపల్లి పట్టణానికి చెందిన వస్త్ర దుకాణ యజమాని ఎన్నికల అధికారులకు చెప్పారు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. 5వేల చీరలు అతనివే అని తేలితే ఇచ్చేస్తామని చెప్తున్నారు.
అనంతపురం జిల్లా సరిహద్దులో వాచ్‌లు సీజ్
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కర్ణాటక పోలీసులు జరిపిన తనిఖీల్లో... ఓ కారులో సీఎం జగన్ ఫొటోతో ఉన్న చేతి వాచ్‌లు బయటపడ్డాయి. కర్ణాటకలోని బాగేపల్లి చెక్‌పోస్టు దగ్గర వాహనాలను తనిఖీలు చేస్తుండగా... బెంగుళూరు వైపు వెళ్తున్న AP39HE1111 నెంబర్ గల కారును కర్ణాటక పోలీసులు ఆపారు. ఆ కారును తనిఖీ చేయగా... సీఎం జగన్ ఫోటో ఉన్న చేతి వాచ్‌లు దొరికాయి. కారులో ఉన్న బి.నాగేంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే... అతను.. ఏఆర్ కానిస్టేబుల్ అని అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించారు. కర్ణాటక పోలీసులకు పట్టుబడిన కారు.. అనంతపురం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేదని సమాచారం. అనంతపురం పోలీసులు మాత్రం.. దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అనంతపురం నుంచి బెంగుళూరుకు వలస వెళ్లిన ఓటర్లకు పంచేందుకు ఈ వాచీలు తీసుకెళ్తున్నట్టు సమాచారం.