ICSE ISC Result 2024: ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్‌సీ (ISC) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 6న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ICSE Result: ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్‌సీ (ISC) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 6న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ కోర్సు, ఐడీ, ఇండెక్స్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో ICSE 10వ తరగతికి సంబంధించి మొత్తం 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 98.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతిలో ఇండోనేషియా, సింగపూర్, దుబాయ్ 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతి ఫలితాల్లో సింగపూర్, దుబాయ్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మే 10 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు ICSE, ISC పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 12వ తరగతికి సంబంధించి ఫిబ్రవరి 26న నిర్వహించాల్సిన పరీక్షను మార్చి 21న నిర్వహించారు. అదేవిధంగా మార్చి 27న నిర్వహించాల్సిన సైకాలజీ పరీక్షను ఏప్రిల్ 4న నిర్వహించారు. ఇందులో ICSE పరీక్షలకు మొత్తం 2,43,617 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 1,30,506 (53.57 %), బాలికలు 1,13,111 (46.43%) మంది ఉన్నారు. ఇక ISC పరీక్షలకు సంబంధించి మొత్తం 99,901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 52,765 (52.82 %), బాలికలు 47,136 (47.18 %) మంది ఉన్నారు. 10, 12వ తరగతుల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
➥ పదోతరగతికి సంబంధించి మొత్తం 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 99.65% ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 99.31%గా నమోదైంది. మొత్తం 2,43,617 మంది పరీక్షలకు హాజరుకాగా.. 2,42,328 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 1,29,612 మంది, బాలికలు 1,12,716 మంది ఉన్నారు. ఇక 1298 మంది పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలురు 894 మంది, బాలికలు 395 మంది ఉన్నారు.
➥ 12వ తరగతికి సంబంధించి మొత్తం 98.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 98.92% ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 97.53%గా నమోదైంది. పరీక్షలకు మొత్తం 99,901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 98,088 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 51,462 మంది, బాలికలు 46,626 మంది ఉన్నారు. ఇక 1813 మంది పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలురు 1303 మంది, బాలికలు 510 మంది ఉన్నారు.
➥ CSE పరీక్షల్లో మొత్తం 60 సబ్జెక్టులు ఉండగా.. ఇందులో 20 భారతీయ బాషలు, 13 విదేశీ భాషలున్నాయి. వీటితోపాటు ఒక క్లాసికల్ లాంగ్వేజ్ సబ్జెక్టు ఉంటుంది. ఇక ISC పరీక్షకు సంబంధించి మొత్తం 47 సబ్జెక్టులు ఉండగా.. ఇందులో 12 భారతీయ బాషలు , 13 విదేశీ భాషలున్నాయి. వీటితోపాటు రెండు క్లాసికల్ లాంగ్వేజ్ సబ్జెక్టులు ఉంటాయి.
రీజియన్ల వారీగా ఫలితాలు..
రీజియన్ల వారీగా 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే.. వెస్టర్న్ రీజియన్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో సౌత్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, నార్తర్న్ రీజియన్ నిలిచాయి. వెస్టర్న్ రీజియన్‌లో 33,590 (99.91%) విద్యార్థులు, సౌత్ రీజియన్‌లో 33,590 (99.88%) విద్యార్థులు, ఈస్టర్న్ రీజియన్‌లో 74,790 విద్యార్థులు (99.24%), నార్తర్న్ రీజియన్ 81,909 (98.01%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫారిన్ రీజియన్‌లో 782 (93.54%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
రీచెకింగ్, రీ వెరిఫికేషన్ వివరాలు..
ఫలితాల్లో విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే రీచెకింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ ద్వారా లేదా వారు చదివే స్కూల్ ద్వారా మే 6 నుంచి 10 వరకు రీ-చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీ వెరిఫికేషన్ కోసం ICSE విద్యార్థులు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించాలి. ISC విద్యార్థులు సైతం ఒక్కో సబ్జెక్టు రీ వెరిఫికేషన్ కోసం రూ.1,500 మేర చెల్లించాల్సి ఉంటుంది. నెలరోజుల్లో ఈ ఫలితాలు వెలువడతాయి.