TGTET: 'టెట్' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
TG TET 2024: టీజీ టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబరు 22 వరకు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు.
TG TET 2024 Application Edit: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2204 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబర్ 22 వరకు వివరాలు సవరించుకోవచ్చని టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టెట్ దరఖాస్తు గడువు నవంబర్ 20తో ముగియనుంది. టెట్ పరీక్ష కోసం దాదాపు 1.26 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పేపర్-1కు 39,741, పేపర్-2కు 75,712 మంది, రెండింటికీ కలిపి 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు ఇంకా సమయం ఉండటంతో.. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదనంగా మరో 50 వేల దరఖాస్తులు రావచ్చని భావిస్తున్నారు. అభ్యర్థులు www.schooledu.telagana.gov.in. వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383, 90007561 78 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
టెట్ దరఖాస్తు ఫీజును కూడా ప్రభుత్వం భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ.2000 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఫీజను రూ.750కి కుదించారు. అంటే ఒక పేపర్ రాసేవారు రూ.750 చెల్లించాలి. రెండు పేపర్లు రాసేవారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఆఫీస్: 70750 88812/70750 28881, వెబ్‌సైట్ సంబంధిత: 70750 28882/70750 28885, టెక్నికల్ సమస్యలకు: 70329 01383/ 90007 56178 నంబర్లలో సంప్రదించవచ్చు. నిర్ణీత పనివేళల్లో మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది.
గతంతో పోల్చితే ఆదరణ తక్కువే..
ఇదిలా ఉండగా.. టెట్ పరీక్షపై అభ్యర్థుల్లో ఆసక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2022 టెట్ కోసం 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా.. 2023లో 2.86 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి ఏకంగా 6.28 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక టెట్ (నవంబరు)-2024కు ఇప్పటివరకు 1.26 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. ఇది వరకు టెట్ నిర్వహించినప్పుడల్లా 4-6 లక్షల మంది దరఖాస్తు చేసేవారు. కాని ఈసారి 2 లక్షలు కూడా దాటలేకపోయింది. నిరుద్యోగులతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్ టీచర్లు టెట్‌కు హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సైతం టెట్ స్కోరును తప్పనిసరి చేయడంతో.. వర్కింగ్ టీచర్లు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య పెరగాలి. కానీ అభ్యర్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంటూ వస్తోంది. టెట్ వ్యాలిడిటీ గతంలో 7 సంవత్సరాలు ఉండగా.. దాన్ని జీవితకాలంపాటు పొడిగించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ రాసేందుకు ఆసక్తిచూపడంలేదు.
జనవరి 1 నుంచి పరీక్షలు..
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌లో జనరల్ అభ్యర్థులు అర్హత సాధించడానికి కనీసం 60% మార్కులు (అంటే 150 మార్కులకు 90 మార్కులు) స్కోర్ చేయాల్సి ఉంటుంది. OBCవర్గాలకు చెందిన అభ్యర్థులుు 75 మార్కులు సాధిస్తే చాలు అర్హత సాధించినట్టే. SC/ST/PH అభ్యర్థులకు 50 మార్కులు వస్తే వాళ్లు డీఎస్సీ రాసుకునేందుకు అర్హులు అవుతారు.
పరీక్ష ఇలా..
TG TETలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1, పేపర్ 2. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు TG TET పేపర్ 1 పరీక్ష రాస్తారు. దీనికి డీఈడీ చేసి చేసిన వాళ్లు మాత్రమే అర్హులు. 6 తరగతి నుంచి 8 తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 2 కోసం పరీక్ష రాస్తారు. బీఈడీ చేసిన వాళ్లు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. వీళ్లు కాకుండా 1 నుంచి 8 తరగతుల వరకు బోదించే వాళ్లు రెండు పేపర్లు రాస్తారు. TG TET పరీక్షా సరళి చూస్తే పేపర్ 1కి పేపర్ 2కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నాలుగు ఆప్షన్స్ (MCQలు)ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పేపర్ 1, పేపర్ 2 సిలబస్‌ను ఇక్కడ చూడొచ్చు.