TS TET - 2024 దరఖాస్తు, అప్లికేషన్ ఎడిట్‌కు ముగుస్తోన్న గడువు, వెంటనే పూర్తిచేయండి
TS TET 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
TS TET 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 10తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు.
మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.
వీరు అర్హులు..
➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.
➥ పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2024 నోటిఫికేషన్: 14.03.2024.
➥ టెట్-2024 ఇన్‌ఫర్మేషన్ బులిటెన్, సమగ్ర నోటిఫికేషన్: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు. ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.04.2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2024 నుంచి.
➥ టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 - 03.06.2024.
➥ పరీక్ష సమయం: ఉదయం 9 గం. - 11.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గం.- సాయంత్రం 4.30 వరకు.
➥ టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024.
TS TET 2024 Detailed Notification