TS SSC Supplementary Exams: పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడి, పరీక్షల షెడ్యూలు ఇలా
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను, పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి జూన్ 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
TS SSC Supplemantary Exams: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను, పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి జూన్ 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు ఎంటి ఆలస్య రుసుము లేకుండా మే 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకునేవారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 13 మధ్య సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, ప్రథమ భాషలో కాంపోజిట్ కోర్సుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక మిగిలిన అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 99.09 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండోస్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ జూన్ 3న: తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు-1, కాంపోజిట్ కోర్సు-2 పరీక్షలు
➥ జూన్ 5న: సెకండ్ లాంగ్వేజ్
➥ జూన్ 6న: ఇంగ్లిష్
➥ జూన్ 7న: మ్యాథమెటిక్స్
➥ జూన్ 8న: భౌతికశాస్త్రం (ఫిజికల్ సైన్స్)
➥ జూన్ 10న: జీవశాస్త్రం (బయాలజీ)
➥ జూన్ 11న: సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్)
➥ జూన్ 12న: ఓఎస్‌ఎస్‌సీ (ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-1,
➥ జూన్ 13న: ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 వరకు అవకాశం..
పదోతరగతి ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.500 ఫీజు చెల్లించాలి. ఇక రీవెరిఫికేషన్, డూప్లికేట్ క్వశ్చన్ పేపర్స్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మే 15 లోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాథ్యాయులతో సంతకం చేయించిన దరఖాస్తులో హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో ఆఫీస్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్టు చేసిన దరఖాస్తులు స్వీకరించేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..