(Source: ECI/ABP News/ABP Majha)
Telangana SSC Results: తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? రిజల్ట్ కోసం 5 లక్షలకుపైగా విద్యార్థుల నిరీక్షణ
TS 10th Class Results Date: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
TS SSC Results Date: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారంరోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30న కుదరని పక్షంలో మే 1న పదోతరగతి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి జవాబుపత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 20తో మూల్యాంకనం పూర్తయింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నాయి.
గతేడాది తెలంగాణలో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుదల చేశారు. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 30 నాటికి లేదా మే 1న తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది.
ALSO READ:
AP SSC Results: ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల, 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థులు అర్హత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు. ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.