TET Details Edit: తెలంగాణ ‘టెట్’ అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో సవరణకు మరో అవకాశం
TET: తెలంగాణ టెట్ వివరాల్లో తప్పుల సవరణకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ మార్కులు, హాల్‌టికెట్, తదితర వివరాలను మార్చుకోవచ్చు. సెప్టెంబరు 13 వరకు అవకాశం కల్పించింది.
TGTET Application Edit: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థులు తమ మార్కులు, హాల్‌టికెట్, తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసే సమయంలో.. తప్పులు దొర్లితే సవరించుకునేందుకు మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు సెప్టెంబరు 12, 13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చు. వివరాల్లో మార్పులకు ఇదే చివరి అవకాశమని, సెప్టెంబరు 13 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణకు అవకాశం ఇవ్వబోమని, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాతపరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ 'కీ' విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్ట్(జీఆర్‌ఎల్) ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులపాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా సంక్షిప్త సందేశాలను పంపనున్నారు.
ఇక టెట్-2024 ఫలితాలకు సంబంధించి పరీక్ష కోసం మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనపర్తి (152) ఉన్నాయి.
డీఎస్సీ ఫైనల్ ‘కీ’పైనా అభ్యంతరాలు..
తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ కీపైనా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల కోసం 2.45 లక్షల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సెప్టెంబరు 6న రాత్రి డీఎస్సీ తుది కీని విద్యాశాఖ వెల్లడించింది. ప్రాథమిక, తుది కీల మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చింది. మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది. డీఎస్సీ 80 మార్కులకు, టెట్ 20 మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టును విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. వీరికి సంబంధిత డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం మెరిట్ ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.