State Scholarships: స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు పెంపు, ఎప్పటివరకు పొడిగించారంటే?
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్స్(Scholarships), బోధనా రుసుముల(Tution Fees) రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.
TS Scholarships Application: తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్స్(Scholarships), బోధనా రుసుముల(Tution Fees) రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. డిసెంబరు 31తో ముగియాల్సిన గడువును నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు జనవరి 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం (డిసెంబరు 30) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈపాస్ గణాంకాల ప్రకారం రెన్యువల్ విద్యార్థులు 8,04,304 మంది ఉంటే ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం సంక్షేమశాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే వీటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువు మరో మూడు నెలలు పొడిగించాలని ఎస్సీ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ నుంచి సానుకూల స్పందన రావడంతో దరఖాస్తు గడువును జనవరి 31 వరకు పొడిగించారు.
బోధన ఫీజుల బకాయిలపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ఉపకారవేతనాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన రూ.3250 కోట్లలో రూ.1250 కోట్లకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు ట్రెజరీలకు పంపించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో నిధుల కొరత నెలకొంది. 2023-24 ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల డిమాండ్ దాదాపు రూ.2400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం కలిపితే వచ్చే మార్చి నాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.5650 కోట్లకు చేరుకోనున్నాయి.
రెండేళ్లుగా ఫీజుల్లేవ్..
రాష్ట్రంలో ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్స్ కోసం ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ మరుసటి ఏడాదే ప్రభుత్వం బోధన ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తూ వస్తోంది. కరోనా అనంతరం చెల్లింపులు ఆలస్యం కావడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన, చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు కలిపి 2022-23 విద్యాసంవత్సరం నాటికే రూ.3250 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫీజుల విడుదల్లో ఆలస్యం, సంక్షేమ శాఖలు విడుదల చేసిన బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాల కోసం అప్పులు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి వస్తోంది.