TS Inter Fees: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్షా ఫీజు గడువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ ఫీజు కింద రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు మరోసారి గడువు పొడిగించారు. రూ.100 ఆలస్య రుసుంతో డిసెంబరు 12 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాలి.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 14 నుంచి 30లోపు ఫీజులు చెల్లించాలని గతంలో ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు వెయ్యి రుసుముతో 14 నుంచి 17 వరకు రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే విద్యార్థుల వినతి మేరకు తాజాగా కేవలం రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 12 వరకు ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు.
పాత పద్దతిలోనే పరీక్షలు..
ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది 100 శాతం సిలబస్ అమలవుతుందని.. పాత పద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కళాశాలల్లో అడ్మిషన్ పొందకుండా.. హాజరు శాతం లేకుండా హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయవచ్చని సూచించారు.
పరీక్ష ఫీజు వివరాలు ఇలా..
🔰 ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
🔰 ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.
🔰 ఒకేషనల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.
🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. (డిసెంబరు 12 వరకు పొడిగించారు).
🔰 రూ. 100 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 2000 ఆలస్య రుసుంతో తెలియాల్సి ఉంది.
సమూలంగా మారనున్న బోర్డు స్వరూపం!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంటర్మీడియేట్ విద్యలో గణనీయమైన మార్పులు తేవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
➔ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేయనున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేయనున్నారు.
➔ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయనున్నారు.