Telangana News: మెడికల్ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
MBBS:మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ ప్రవేశాలలో ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
EWS Reservations in Medical Admissions: తెలంగాణలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్(BDS)తోపాటు పీజీ మెడికల్ (PG Medical) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం.. ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ భాజపాకు చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు వాదనలు ఇలా..
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎంసీఐ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా ప్రవేశాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఏజీ (అడ్వొకేట్ జనరల్) ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని రికార్డు చేసిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను ముగించింది.
స్థానికతపై క్లారిటీ.. కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో... ఇంటర్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతిస్తూ, కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సైతం పరిగణనలోకి తీసుకోవాలంది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయశాఖ సమీక్ష, సూచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించింది. కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది.
సెప్టెంబరు 26 నుంచి వెబ్ఆప్షన్ల నమోదు..
విద్యార్థులు సెప్టెంబరు 26 నుంచే వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. గతేడాది కళాశాలల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. దీని ఆధారంగా వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకుంటే, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభమవుతుంది.
మొత్తం 8,900 ఎంబీబీఎస్ సీట్లు..
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన అన్ని సీట్లు రాష్ట్ర విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు కళాశాలల్లో మరో 4,810 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలినవి బీ, సీ కేటగిరీ సీట్లుగా అందుబాటులో ఉంటాయి.