జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్న ఇంజినీరింగ్ కళాశాలలు జులై 28లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలి. పరిశోధనల కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చు. జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.
ఆ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు..
ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది. ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని, ఐచ్ఛికమేనని స్పష్టంచేసింది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఆయా అభ్యర్థులు నెట్/సెట్/స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని పేర్కొంది.
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన నిబంధనలు జులై 1 నుంచే దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించడంతో ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ డిగ్రీ తప్పనిసరి కాదు. దీంతో బోధనపట్ల ఆసక్తి కలిగి పీహెచ్‌డీ డిగ్రీలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కలగనుంది.
ALSO READ:
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్-2023' కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial