Hospital Service: పీజీ వైద్య విద్యార్థుల 'గ్రామీణ' సేవలు, మార్చి 1 నుంచే అమలు!
పీజీ వైద్య విద్యార్థులందరూ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం కింద గ్రామీణ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మూడు నెలలపాటు పనిచేసే విధానం బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
పీజీ వైద్య విద్యార్థులందరూ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం కింద గ్రామీణ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మూడు నెలలపాటు పనిచేసే విధానం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు దీన్ని అమలుచేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. మంగళగరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 28న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రుల వారీగా మ్యాపింగ్ చేసిన జాబితాను వైద్య కళాశాలలకు పంపామన్నారు. ఈ జాబితాలో ఉన్న పీజీ విద్యార్థులు తప్పనిసరిగా ఆసుపత్రుల్లో బ్యాచ్‌ల వారీగా పనిచేస్తారని తెలిపారు. ప్రతి బ్యాచ్‌లో 250 మంది విద్యార్థులు ఉంటారన్నారు.
తెలంగాణలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది ప్రొఫెసర్లు సొంత క్లినిక్స్ పెట్టుకుని పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారన్న సమాచారం ఉందని, ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. చదువుల ఒత్తిడి లేకుండా కళాశాలల్లో అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలని, విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటుచేయాలన్నారు. కళాశాలల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. సీనియర్, జూనియర్ వైద్య విద్యార్థులకు వేర్వేరుగా భోజన సమయాలు ఉండాలని సూచించారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం పీజీ వైద్య విద్యార్థులకు మార్చి 1 నుంచి 'డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్' అమలుచేయబోతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించే వారు కోర్సు ముగిసేలోగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల పరిధిలో పనిచేయడాన్ని ఎన్ఎంసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
గతేడాది నుంచే ఈ విధానాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించగా కొవిడ్ కారణంగా సాధ్యపడలేదు. ఈ మినహాయింపును ఎన్ఎంసీ తొలగించడంతో ఈ ఏడాది నుంచి అమలుచేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి సుమారు రెండువేల మంది ప్రతి ఏటా పీజీలో ప్రవేశాలు పొందుతున్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రథమ, మూడో సంవత్సరం చదివే సమయంలో కాకుండా రెండో సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తామని డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ వెల్లడించారు.
Also Read:
TSRJC CET - 2023: టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..