NEET UG Age Limit: "నీట్" ఆశావహులకు గుడ్ న్యూస్.. ఇక నో ఏజ్ లిమిట్ !
నీట్ ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను తొలగించారు.
నీట్ ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను తొలగించారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్య ర్థులు 17 ఏళ్ల వయసు నిండి.. 25 ఏళ్ల లోపు వారై ఉండా లి. ఎస్సీ,ఎస్టీలకు 30 ఏళ్ల వరకూ అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2017లో గరిష్ట వయోపరిమితి విధించింది. 21 అక్టోబర్, 2021న జరిగిన 4వ NMC సమావేశంలో NEET-UG పరీక్షలో హాజరు కావడానికి ఎటువంటి నిర్ణీత గరిష్ట వయో పరిమితి ఉండకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు అధికారిక ప్రకటన చేశారు.
ఈ మేరకు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, 1997పై నిబంధనలను సవరించడానికి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ వయసు అర్హతల సడలింపు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వయసు నిబంధనల సడలింపుపై చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. నీట్ పరీక్షపై కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి ఇది కూడా ఓ కారణం.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ లేదా జూలైలో జరగనుంది. జూన్ మూడవ వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నీట్ యూజీ పరీక్షను దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడాదికోసారి జరిగే ఏకైక ప్రవేశ పరీక్ష ఇది. కాగా గత ఏడాది.. కోవిడ్ (COVID-19) కారణంగా ఈ పరీక్షలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాయిదా అనంతరం సెప్టెంబర్‌లో నీట్ 2021 పరీక్ష జరిగింది. అంతేకాకుండా సిలబస్‌ను కూడా చాలా వరకు తగ్గించిన ఎన్టీఏ.. నీట్ 2021 పరీక్షను మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ల రూపంలో నిర్వహించింది. ఈ సారి పరిక్ష ఎలా నిర్వహిస్తారో ఇంకా ప్రకటన రాలేదు.
గతంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే నీట్ పరీక్షను ఉపయోగించేవారు. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కూడా నీట్ పరీక్ష ద్వారానే చేపడుతున్నారు. ఇక నీట్, జేఈఈ రెండు పరీక్షలకు టై బ్రేకింగ్ విధానం నుంచి అభ్యర్థుల వయస్సు ప్రమాణాన్ని ఎన్టీఏ తొలగించింది. అంటే ఎక్కువ వయసున్న అభ్యర్థికి ర్యాంకు లిస్టులో ప్రాధాన్యత ఉండదన్నమాట. ఇప్పుడు నీట్‌లో ఏజ్ లిమిట్ తీసేశారు. ఇది విద్యార్థులకు మరింత ఉపయోగపడనుంది.