NEET UG Counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా, త్వరలోనే కొత్త తేదీల ప్రకటన
NEET UG Counselling: దేశవ్యాప్త ఆందోళనల మధ్య నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదావేశారు. కౌన్సెలింగ్‌ను వాయిదావేస్తున్నట్లు ఎన్టీఏ జులై 6న ఒక ప్రకటనలో తెలిపింది.
NEET UG Counselling Postponed: దేశంలోని మెడికల్ కాలేజీల్లో వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జులై 6 నుంచి ప్రారంభంకావాల్సిన కౌన్సెలింగ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే వెల్లడిస్తుందని ఎన్టీఏ ప్రకటించింది. ఒకపక్క నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు జులై 5న నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కౌన్సెలింగ్‌ను వాయిదావేస్తూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
నీట్ యూజీ రద్దుకు కేంద్రం ససేమిరా..
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. తాజాగా అక్రమాల ఆరోపణలపై కేంద్రం, ఎన్‌టీఏ జులై 5న న్యాయస్థానానికి అఫిడవిట్లు సమర్పించాయి. నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం కోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను ఎన్టీఏ వాయిదా వేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో ఏకంగా 67 మంది అభ్యర్థులకు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వార్తలు వచ్చాయి. మరోవైపు నీట్ యూజీ పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను కేంద్రం రద్దు చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని జూన్ 30న విడుదల చేసిన ఎన్టీఏ, జులై 1న ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు 1563 అభ్యర్థులకుగాను కేవలం 813 మంది (52 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 48 శాతం మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు మినహాయించి ఒరిజినల్ స్కోర్లను ఎంచుకున్నారు. అయితే ఈ సారి పరీక్షరాసిన 813 మందిలో ఒక్కరికి కూడా 720/720 మార్కులు సాధించకపోవడం విశేషం. దీంతో నీట్ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయింది.
పేపర్ లీకుల నేపథ్యంలో.. ఇందుకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్రం 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(Public Examinations (Prevention of Unfair Means) Act, 2024)యాక్ట్ - 2024ను అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను లీక్ చేసినా.. వాటిని అందుకున్నా నేరంగా పరిగణిస్తారు. పేపరు లీక్ చేసేవాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధించే వెసుబాటు ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే.. వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.