(Source: ECI/ABP News/ABP Majha)
JEE Main Counselling 2021: అక్టోబర్ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్.. అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..
JEE Main Counselling: జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి మొదలు కానుంది. జోసా (JoSAA) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది. అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.
దేశంలో ఐఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ), ఎన్‌ఐటీలు (నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఐటీలతో (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ మేరకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా– JoSAA) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాక అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జోసా వెల్లడించింది.
జేఈఈ మెయిన్ నాలుగో విడత ఫలితాల విడుదలలో జాప్యం నెలకొన్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ పరీక్షల ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 11వ తేదీకి ముందే విడుదల అవుతాయని అంతా భావించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించాలని ఐఐటీ ఖరగ్‌పూర్ గతంలో అధికారిక నోటిఫికేషన్ సైతం వెలువరించింది. అయితే జేఈఈ మెయిన్ నాలుగో విడత ఫలితాలు ఆలస్యం కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మెయిన్ నాలుగో విడత ఫలితాలు 14వ తేదీన విడుదలయ్యాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు గడువును ఐఐటీ ఖరగ్‌పూర్ పొడిగించింది. అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు గడువు నిన్నటితో ముగియాల్సి ఉండగా.. మరో 24 గంటల పాటు పెంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఈరోజు (సెప్టెంబర్ 21) రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు రుసుము చెల్లించే గడువును మాత్రం పొడిగించలేదు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.2,800ని ఈ రోజు రాత్రి 11:59 లోగా చెల్లించాల్సి ఉంటుంది.
2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు..
జేఈఈ మెయిన్‌లో నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన వారు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. దీని ప్రకారం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా అక్టోబర్ 3న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకానున్నారు. అడ్వాన్స్‌డ్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అక్టోబర్ 5 సాయంత్రం నుంచి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ 10న అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 10, 11 తేదీల్లో స్వీకరించనున్నారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష తుది ఫలితాలు అక్టోబర్ 15న విడుదల కానున్నాయి. అడ్మిషన్ల కౌన్సెలింగ్ 16 నుంచి ప్రారంభం కానుంది.
20 మందిపై వేటు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ పరీక్షలను 4 సెషన్లలో నిర్వహించింది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 9,39,008 మంది దరఖాస్తు చేశారు. ఈ నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ మార్కులు సాధిస్తే దానినే తుది ఫలితంగా పరిగణిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన 20 మంది విద్యార్థులపై ఎన్‌టీఏ వేటు వేసింది. హరియాణాలోని సోనిపట్‌లో ఒకే పరీక్ష కేంద్రంలో వీరంతా ఎగ్జామ్ రాసినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ.. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ అవకతవకల్లో పాలుపంచుకున్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు తెలిపింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్ చేసింది.
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?