B.Tech Courses: కొలువులకు దీటైన టెక్నాలజీ కోర్సులు.. రోబోటిక్స్, ఏఐ ఇంకా ఎన్నో.. ఈ ఏడాది నుంచే అమలు..
ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మంచి బూమ్ ఉన్న 9 కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు తెలిపింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొలువు దక్కాలంటే టెక్నాలజీకి తగినట్లుగా అప్‌డేట్ అవ్వాలి. మన దగ్గర ఇలాంటి టెక్నికల్ కోర్సులు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో సాంప్రదాయక కోర్సులను ఎంచుకుంటున్నారు. ఫలితంగా చదువు పూర్తయ్యాక ఉద్యోగావకాశాల కోసం కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే దీనికి మనం కొంత అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తుంది. వీటికి చెక్ పెడుతూ ఏఐసీటీఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అనుసంధానంతో కొత్త ఆవిష్కరణలు చేపడుతోన్న 9 స్పెషలైజేషన్ కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ కోర్సులు 2020-21 విద్యా సంవత్సరం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ విభాగాల్లో మొత్తం కలిపి 2,550 సీట్లు ఉండనున్నాయి.
- ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
భారతదేశం సహా ప్రపంచ దేశాలలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా మనుషులు చేసే పనులను రోబోల ద్వారా చేయించవచ్చు. మెషీన్ల సామర్థ్యం పెంచేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది. ఏఐ టెక్నాలజీతో నడిచే రోబోలు, కార్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ టెక్నాలజీతో మనుషుల సాయం లేకుండానే పనులు జరుగుతుంటాయి. కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను రూపొందించి అద్భుతాలు సాధిస్తున్నాయి. భవిష్యత్ అంతా ఏఐ రంగం మీదే నడుస్తుంది. - సైబర్ సెక్యూరిటీ..
సైబర్ సెక్యూరిటీ.. అత్యంత డిమాండ్ ఉన్న కెరీర్‌లలో ఒకటి. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరుగుతోన్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. సైబర్ నిపుణులు మాత్రమే హ్యాకర్ల ఆగడాలకు చెక్ పెట్టగలుగుతారు. ఇండియాలో 2024 నాటికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ 200 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. - రోబోటిక్స్
ప్రపంచ దేశాల్లో చాలా పరిశ్రమలు కార్మికుల స్థానంలో రోబోలను ప్రవేశపెట్టి.. తక్కువ డబ్బు పెట్టుబడితో అధిక లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. రోబోటిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఇక ఇటీవల కాలంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ సైతం మనిషిని పోలిన రోబోను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. - డేటా సైన్స్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ కెరీర్ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. డేటా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. డేటా అనలెటిక్స్ ద్వారా రీసెర్చ్ చేయడంపై ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. - త్రీడీ ఇమేజ్ ప్రింటింగ్
ఈ స్పెషలైజేషన్ కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ వారికి మాత్రమే ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచీలో ఆవిష్కరణలు 2డీ నుంచి 3డీకి మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్రీడీ ఇమేజ్ ప్రింటింగ్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. - అగ్యుమెంటేషన్ రియాలిటీ/ వర్చువల్ రియాలిటీ
గేమింగ్ రంగం శరవేగంగా దూసుకుపోతుంది. ఇందులో ఉపయోగించే అగ్యుమెంటేషన్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీల వల్ల గేమ్స్ ఆడేవారు అందులో లీనమైన అనుభూతి కలుగుతుంది. మనం ఆటలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. అందులో ఆడుతున్నట్లుగానే భావన కలిగేలా చేయడంలో ఈ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయి. - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
దీని ద్వారా ఎక్కడి నుంచైనా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించవచ్చు. అంటే మనం ఆఫీసుకు వెళ్తూ.. ఫ్యాన్ ఆపేయడం మర్చిపోయినా దీని ఆఫీస్ నుంచే ఆపేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీలు విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉంది. - బ్లాక్ చెయిన్..
హ్యాకర్ల బారి నుంచి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు సురక్షితంగా ఉంచడంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తోడ్పడుతుంది. దీని ద్వారా మన ఆర్థిక లావాదేవీలను బిట్‌కాయిన్ రూపంలో మార్చుకోవచ్చు. భద్రత ఈ టెక్నాలజీలో బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు. - క్వాంటమ్ కంప్యూటింగ్
మన నిత్య జీవితంలో భాగమైన కంప్యూటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది. కంప్యూటర్లలో మనకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ రంగంలో కూడా ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.
త్వరలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్..
ఏపీలో ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఐటీ బ్రాంచీలను ఎంచుకునే వారికి ఈ కొత్త కోర్సులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి పైన పేర్కొన్న 9 కోర్సులలో మీకు నచ్చిన దానిని ఎంచుకుని మీ కెరీర్ డిసైడ్ చేసుకోండి.
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also Read: ANGRAU Admissions 2021: ఏపీ వ్యవసాయ పాలిటెక్సిక్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే?