Higher Education in AP: ఏపీలో ఉన్నత విద్య ప్రవేశాల్లో వ్యత్యాసాలు, AISHE సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (GER) రోజురోజుకు తగ్గిపోతోంది. ఉన్నత విద్య ప్రవేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
AISHE Survey Report AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (GER) రోజురోజుకు తగ్గిపోతోంది. ఉన్నత విద్య ప్రవేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2020-21 సంవత్సరానికిగాను జీఈఆర్ 37.2 శాతం ఉండగా, 2021-22 నాటికి 36.5కి పడిపోయింది. అబ్బాయిల ప్రవేశాలు 0.6శాతం, అమ్మాయిల చేరికలు 0.8 శాతం తగ్గాయి. పక్కనున్న తెలంగాణలో జీఈఆర్ 40శాతం ఉండగా.. తమిళనాడులో 47, కర్ణాటకలో 36.2 శాతంగా ఉంది. కేంద్రం విడుదల చేసిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE - All India survey on Higher Education) 2021-22 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఉన్నత విద్యలో ప్రవేశాలు, అధ్యాపకుల నిష్పత్తిపై నిర్వహించిన సర్వేలో.. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కలిపి రాష్ట్రం నుంచి 3,262 సమాచారాన్ని అందించాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు తగ్గాయి. పీహెచ్‌డీలో రెగ్యులర్‌గా 2020-21లో 6,991మంది ప్రవేశాలు పొందగా.. 2021-22లో ఇది 5,583 కు తగ్గిపోయింది. పీజీలో 1,81,102మంది ప్రవేశాలు ఉండగా.. 2021-22 నాటికి 1,50,142కు పడిపోయింది. జాతీయ స్థాయిలో పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం తగ్గడం గమనార్హం.
రాష్ట్రంలో అన్ని రకాల పీజీ కోర్సుల్లోనూ ఏటా ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. చాలామంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ)తోనే చదువు ఆపేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాఠాల బోధనకు అధ్యాపకుల కొరత ఏర్పడుతుంది. పీహెచ్‌డీలోనూ అదే దుస్థితి నెలకొంది. మరోవైపు విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకునేందుకు, ఉద్యోగాలకు వెళ్లిపోతుండటంతో ఏపీలో పీహెచ్‌డీ, పీజీ ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. జాతీయ స్థాయిలో 18-23 సంవత్సరాల వయసున్నవారు 2017 నుంచి 2021 వరకు పీహెచ్‌డీ, పీజీ ప్రవేశాలలో క్రమంగా పెరుగుతుండగా.. రాష్ట్రంలో తగ్గిపోతున్నారు. 2019లో 54,01,400 మంది ఉండగా.. 2021 నాటికి 52,85,000 పడిపోయింది.
అమ్మాయిల సంఖ్య తక్కువే..
జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో ప్రతి వంద మంది అబ్బాయిలకు 93 మంది అమ్మాయిలే ఉన్నత విద్యలో ఉన్నారు. 2020-21లో 94చొప్పున ఉండగా.. 2021-22కు వచ్చేసరికి ఇది 93కు తగ్గిపోయింది. అత్యధికంగా కేరళలో 144 చొప్పున ఉండగా.. ఒడిశాలో 88మంది ఉన్నారు. రాష్ట్రంలో 18-23 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి లక్ష మందికి 49 కళాశాలలు ఉండగా.. ఒక్కో దాంట్లో సరాసరిన 554మంది చొప్పున ప్రవేశాలు పొందారు.
ప్రవేశాల తీరిది..
➥ 2019-20లో పీజీ ప్రవేశాలు 2,17,840; పీహెచ్‌డీ ప్రవేశాలు 6,716
➥ 2020-21లో పీజీ ప్రవేశాలు 1,95,814; పీహెచ్‌డీ ప్రవేశాలు 6,991
➥ 2021-22లో పీజీ ప్రవేశాలు 1,84,942, పీహెచ్‌డీ ప్రవేశాలు 5,583
ఉన్నత విద్యలో అమ్మాయిలు, అబ్బాయిల నిష్పత్తి పరిశీలిస్తే.. ప్రతి 100 మంది అబ్బాయిలకు ఏపీలో 93 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇక కర్ణాటకలో 101 మంది అమ్మాయిలు, తమిళనాడు 101 మంది అమ్మాయిలు, తెలంగాణ 108 మంది అమ్మాయిలు ఉన్నారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే ప్రతి 100 మంది అబ్బాయిలకు 101 మంది అమ్మాయిలు ఉన్నారు.
ALSO READ:
బిట్‌శాట్- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆయా క్యాంపస్‌లలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ప్రవేశపరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..