Education Apps: పిల్లలకు 'స్మార్ట్'గా చదువు నేర్పే యాప్‌లు..
మీ పిల్లలు అదేపనిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఫోన్ ద్వారా జ్ఞానాన్ని అందించాలనుకుంటున్నారా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వెంటనే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి..
గతేడాది కరోనా రూపంలో ప్రపంచానికి పెద్ద విపత్తు వచ్చింది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బందులకు గురిచేసింది. అయితే అందరికంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంది మాత్రం పిల్లల తల్లిదండ్రులంటే అతిశయోక్తి కాదు. స్కూళ్లు లేవు, పిల్లలను బయటకు పంపలేని పరిస్థితి. ఇలాంటి గందరగోళ వాతావరణంలో చాలా మంది తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లను అలవాటు చేశారు. దీంతో చిన్నారులు స్మార్ట్ స్క్రీన్లపై గడిపే సమయం అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్లను పోన్ల నుంచి దూరం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఫోన్లలో వీడియో గేమ్స్, వీడియోలు మాత్రమే కాకుండా వారికి ఎంచక్కా చదువు చెప్పే వెసులుబాటు ఉంటే? హమ్మయ్యా అనుకోవచ్చు కదా.. సరిగ్గా అదే ఐడియాతో చిన్నారులను అలరిస్తూ వారికి పాఠాలు నేర్పించే యాప్‌లు బోలెడు మనకు అందుబాటులో ఉన్నాయి. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న చిన్నారుల కోసం ఉద్దేశించిన యాప్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఇవి పిల్లల మెదడుకు పదును పెట్టడంతో పాటు వారిలో సృజనాత్మకత పెంచేందుకు తోడ్పడతాయి. వీటి వల్ల చిన్నారుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. పిల్లలకు ఉపయోగపడే కొన్ని యాప్‌ల గురించిన సమాచారం మీ కోసం..
ఖాన్ అకాడమీ కిడ్స్ (Khan Academy Kids)
పిల్లలకు ఉపయోగపడే యాప్స్‌లో ఇది తొలి స్థానంలో ఉంటుంది. 2 నుంచి 8 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఆహ్లాదకర రీతిలో చదువును నేర్పిస్తుంది. అంకెలు, అక్షరాలు, జంతువుల పేర్లు, రంగులు వంటి వాటిని పజిల్స్ రూపంలో అందిస్తుంది. చిన్నారులు సులువుగా అర్థం చేసుకునేలా దీనిని రూపొందించారు. యానిమేటెడ్ బొమ్మలు చిన్నారులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధిస్తుంటాయి. చిన్నారుల కోసం 1,50,000 పైగా అభ్యాసాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్లలో, అమెజాన్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ వినియోగానికి ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు.
స్కెచ్ బుక్ ప్రో (Sketchbook Pro) & కిడ్స్ డూడుల్ (Kids Doodle)
ఇవి రెండూ పెయింటింగ్ యాప్స్. వీటి ద్వారా పిల్లలు వారికి నచ్చిన రీతిలో బొమ్మలు గీసుకోవచ్చు. మీరు ఏదో ఒక పనిచేసుకుంటూ మీ పిల్లలకు నచ్చిన బొమ్మలు వేయమని చెప్పండి. ఎంచక్కా కాస్త సమయాన్ని ఎంగేజ్ చేయవచ్చు. స్కెచ్ బుక్ ప్రోలో పిల్లలు గీసిన బోమ్మలను పైల్స్ రూపంలో భద్రపరచుకునే సౌకర్యం కూడా ఉంది. పెయింటింగ్ అనేది మెదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. సృజనాత్మకతను పెంచుతుంది. వీటిని ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు.
ఫిష్ స్కూల్ (Fish school )
3 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు (ప్రీస్కూలర్) ఈ ఫిష్ స్కూల్ చాలా ఉపయోగకరమైన యాప్. ఇంగ్లిష్ వర్ణమాల (A నుంచి Z), నంబర్లు (1 నుంచి 20), ఆకారాలు, రంగులు, జతపరచడం లాంటివి ఇందులో ఉంటాయి. ముదురు రంగులో ఉండే చేపలను చూపిస్తూ పిల్లలకు ఇవన్నీ నేర్పిస్తారు. చేపలను టచ్ చేయడం, అటూ ఇటూ జరపడం వంటి వాటి ద్వారా పిల్లలు అక్షరాలు, నంబర్లను నేర్చుకోగలుగుతారు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్లలో అందుబాటులో ఉంది. దీనిని కూడా ఉచితంగా వాడుకోవచ్చు.
బోలో యాప్ (Bolo App)
దీనిని టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల కోసం దీనిని తీసుకొచ్చింది. తెలుగు సహా పలు స్థానిక భాషలలో ఇది అందుబాటులో ఉంది. చిన్నారులు ఇంగ్లిష్, హిందీ బాషలను సులభంగా నేర్చుకోవడంతో పాటు పఠనా శక్తిని పెంచుకునేందుకు ఈ యాప్ తోడ్పడుతుంది. ఇందులో 'దియా (Diya)' అనే యానిమేటెడ్ క్యారెక్టర్ పిల్లలకు భాషలను నేర్పించడం, కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ఇందులో ఉన్న కథలన్నింటిని గూగుల్ ఉచితంగానే అందిస్తోంది. ఫన్నీ విధానంలో, ప్లేఫుల్‌గా పిల్లలకు పదాలను నేర్పుతుంది. స్పీచ్ రికగ్నిషన్ (speech recognition) , టెక్ట్స్ టు స్పీచ్ (Text to Speech) టెక్నాలజీల సాయంతో గూగుల్ దీనిని రూపొందించింది.
యూక్లూ (uKloo)
యూక్లూ అనేది ఒక స్కావెంజర్ హంట్ గేమ్. ఇందులో కొన్ని యూనిమేటెడ్ బొమ్మలు, దృశ్యాలు ఉంటాయి. వాటిలో యూక్లూ కార్డు దాయబడి ఉంటుంది. దానికి తగిన క్లూను ఇంగ్లిషులో ఇస్తారు. దానిని చదివి ఆధారాలను అనుసరించి, యూక్లూ కార్డును వెతకాలి. కార్డును సరిగ్గా వెతికితే తర్వాతి స్థాయికు చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే పదాలు నేర్చుకునే చిన్నారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిని కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు.
నర్సరీ రైమ్స్ (Nursery Rhymes)
ఇందులో నర్సరీ చిన్నారుల కోసం వీడియోలు ఉంటాయి. యానిమేటెడ్ బొమ్మలతో రూపొందించిన నర్సరీ రైమ్స్ చిన్నారులను ఆకట్టుకుంటాయి. 25 నర్సరీ రైమ్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంగ్లిష్ వర్ణమాలతో పాటు జంతువుల గురించి చెబుతున్న వీడియోలు బాగుంటాయి.
ఏబీసీ కిడ్స్ (ABC Kids)
ఏబీసీ కిడ్స్ అనేది 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు ఉపయోగపడే యాప్. ఇందులో ఫొనెటిక్స్ ద్వారా ఇంగ్లిష్ వర్ణమాల అక్షరాలను నేర్పిస్తారు. దీనికి గానూ బొమ్మలు, చిత్రాలు, ఆకారాల సాయంతో అక్షరాలను నేర్పుతారు. 8 ఏళ్ల చిన్నారుల కోసం మరో యాప్ కూడా ఉంది. దీనిలో కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి.
కుటుకి కిడ్స్ లెర్నింగ్ యాప్ (Kutuki Kids Learning App)
ఇది భారతదేశపు యాప్. ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ అవార్డు గెలుచుకుంది. స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన ఈ యాప్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇది తెలుగు సహా పలు స్థానిక భాషలలో అందుబాటులో ఉంది. ఇందులో అక్షరాలు, సంఖ్యలు, ఫజిల్స్, రంగులు వంటి వాటితో పాటుగా భారతీయ పండుగలు, సంప్రదాయాలు వంటి వాటి గురించి చిన్నారులకు అవగాహన కల్పిస్తారు. ఇవన్నీ ఆహ్లాదకర రీతిలో బోధిస్తారు. ఇందులో చదువు నేర్పినందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.