Teachers Transfers: టీచర్ల బదిలీల జీవోపై వెనక్కు తగ్గిన ఏపీ ప్రభుత్వం, కొత్త మార్గదర్శకాలతో త్వరలోనే జీవో!
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై గతేడాది జారీ చేసిన జీవో 187ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన విధంగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై గతేడాది జారీ చేసిన జీవో 187ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన విధంగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవో 187లోని మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. గతేడాది డిసెంబరు 26న విచారణ జరిపిన హైకోర్టు.. బదిలీ మార్గదర్శకాలు సక్రమంగా లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంది. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్నందున మళ్లీ బదిలీ మార్గదర్శకాలు రూపొందిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ పేర్కొంది.
ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 10న ఏపీ ప్రభుత్వం జీవో 187ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీవోను ఇప్పుడు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు హైకోర్టుకు జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను నివేదించారు. ఈ జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ న్యాయవాది ఈ మేరకు వివరాలను కోర్టుకు సమర్పించారు.
2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 30 చివరి పనిదినమని, 2023-24 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని కోర్టుకు సమర్పించిన మెమోలో విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 187, తదనంతరం జారీ చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు మళ్లీ రూపొందిస్తామని విద్యాశాఖ కోర్టుకు నివేదించిన మెమోలో పేర్కొంది.ః
Also Read:
ఏపీలో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీ అంటున్న కేంద్రం, కేవలం 717 అంటున్న రాష్ట్రం!
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ-ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్) వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. గత పీఏబీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీన్ని కొట్టిపారేశారు. అవి కరోనా సమయంలో ఖాళీలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం మళ్లీ అదే సంఖ్యను వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకపక్క డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేస్తుండగా.. విద్యాశాఖ మాత్రం 717 ఎస్జీటీ ఖాళీలే ఉన్నాయంటూ కేంద్రానికి వెల్లడించడం గమనార్హం. సమగ్ర శిక్ష అభియాన్ వార్షిక ప్రణాళిక, బడ్జెట్ 2023-24కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 22న జరిగిన రాష్ట్ర పీఏబీ సమావేశంలో చేసిన తీర్మానాలను శనివారం విడుదల చేసింది.
మరింత చదవండి..
టీచర్లకు వేసవి సెలవుల్లేవ్! పనులు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ!
ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్ షీట్ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.
మరింత చదవండి..