Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
AP ssc public exams: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు (Intermediate Board) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మార్చి 1 నుంచి బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
AP Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు (Intermediate Board) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మార్చి 1 నుంచి బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. థియరీ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్, వొకేషనల్ పరీక్షలు మార్చి 20లోపు పూర్తిచేయనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా రూపొందించిన ఇంటర్మీడియట్ బోర్డు.. విద్యాశాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. మార్చి తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పరీక్షల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.
మార్చి 21 నుంచి పదోతరగతి పరీక్షలు..
ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే.. మార్చి 21 నుంచి పదోతరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఇక పదోతరగతి పరీక్షల్లో సామాన్యశాస్త్రానికి రెండు పేపర్లు ఉండటంతో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, పదోతరగతి పరీక్షల్లో ఒక పరీక్షకు మరొక పరీక్షకు మధ్య సెలవు ఇవ్వాళా వద్దా అనే అంశంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది.
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు..
రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలను మార్చి 1నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను విడుదల చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు, జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి కొంతముందుగానే పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.
గతేడాది విద్యాసంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు ఉండటంతో ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు కంటే విద్యార్థులు ప్రిపేర్ అవడానికి వీలుంటుంది. దీనికి తోడు ఇంటర్ తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని. ఈసారి జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం అవ్వడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుసమాచారం. కాగా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.
'పది' వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు..
ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు డిసెంబరు 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి డిసెంబరు 7న ఒక ప్రకటలో తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు.
టెన్త్ మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..
ఫీజు చెల్లింపు గడువు..
ఇప్పటికే పదోతగతి ఫీజు చెల్లింపు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.