Computer Seats: ఇంజినీరింగ్ కాలేజీల్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు, పరిమితి ఎత్తివేసిన ఏఐసీటీఈ!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నాటికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అధికంగా ఉండనున్నాయి.
B.Tech Computer Seats: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో (TS Engineering Colleges) వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నాటికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అధికంగా ఉండనున్నాయి. రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సంబంధిత సీట్ల (Computer Science Seats) సంఖ్య ఇప్పటికే 75 శాతానికిపైగా ఉండగా.. ఈసారి మరిన్ని సీట్లు పెరుగున్నాయి. సీట్ల సంఖ్యపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేయడంతో సీట్లు భారీగా పెరునున్నాయి. నిబంధనలను పాటించే కళాశాలలకు ఒక్కో విభాగానికి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడంలేదు. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు తెచ్చుకోవచ్చు.
మౌలిక వసతులు ఉంటే చాలు..
కళాశాలల్లో సీట్లకు అనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపకులు ఉంటే చాలు. మూడేళ్లపాటు అనుమతులు మంజూరు చేయడమే కాకుంగా.. పరిమితికి మించి ఎక్కువ సీట్లను ఇస్తారు. యూజీసీ స్వయంప్రతిపత్తి/న్యాక్-ఏ గ్రేడ్/30 శాతం కోర్సులకు (NBA) గుర్తింపు, వరుసగా అయిదేళ్లపాటు 80 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకు ఈ వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు 2024-25 విద్యాసంవత్సరానికి కళాశాలల అనుమతుల నిబంధనావళిలో ఈ విషయాన్ని పొందుపరచనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ప్రారంభం కావడంతో కళాశాలలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. కాలేజీల్లో కొత్త కోర్సులు, సీట్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఏఐసీటీఈ నియమించే 'ఎక్స్‌పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)' కళాశాలను తనిఖీ చేస్తుంది. పెంచుకునే సీట్లకు అనుగుణంగా తరగతి గదులు, కంప్యూటర్లు, అధ్యాపకులను సంబంధిత కళాశాలలు చూపాల్సి ఉంటుంది.
50కి పైగా కళాశాలలకు అవకాశం..
ప్రస్తుత విద్యాసంవత్సరాని(2023-24)కి సంబంధించి కన్వీనర్ కోటా 70 శాతం కింద 83,766 బీటెక్ సీట్లు ఉండగా.. అందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 56,811 సీట్లున్నాయి. అంటే అది 68 శాతంతో సమానం. ఇక రాష్ట్రంలో ఉన్న 5 ప్రైవేట్ వర్సిటీలు, గీతం, కేఎల్, చైతన్యలాంటి డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లను కలిపితే 75 శాతం వరకు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వచ్చే ఏడాదికి సీట్లు పెంచుకోవడానికి ఏఐసీటీఈ నిబంధనలు న్యాక్-ఏ గ్రేడ్, అటానమస్ లాంటివి కలిగి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు 50 వరకు ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోనే 46 వరకు అటానమస్ కళాశాలలు ఉండటం గమనార్హం. కనీసం సగం కళాశాలలు అంటే 50 కళాశాలల వరకు దరఖాస్తు చేసుకొని ఒక్కో సెక్షన్ పెంచుకున్నా 1500 సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.
ALSO READ:
ప్లేస్‌మెంట్లలో ఐఐటీ బాంబే విద్యార్థుల సత్తా, 85 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీ
ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో (Campus Placements) మరోసారి సత్తా చాటారు. 2023-24 నియామక ప్రక్రియలో భాగంగా ఏకంగా 85 మంది విద్యార్థులు కోటి రూపాయలకుపైగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి మొత్తంగా 1340 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా.. వీరిలో 1188 మంది భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఉద్యోగాలకు IIT Bombay నుంచి ఎంపికయ్యారు. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా వచ్చాయి. జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పనిచేసేందుకు ఎంపికయ్యారు. వీరిలో 85మందికి కోటి రూపాయల కంటే ఎక్కువ వేతనంతో జాబ్ ఆఫర్లు వచ్చాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.3 కోట్లుగా ఉంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..