Medchal News: చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం, ప్రాణాలకు తెగించి కాపాడిన రిపోర్టర్
Hyderabad News: ఓ వివాహిత చెరువులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అక్కడకు చేరుకున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పల్నాటి శివకుమార్ ప్రాణాలకు తెగించి తాడు సాయంతో ఆమెను కాపాడాడు.
Medchal News : జీవితం చాలా విలువైనది. అలాంటి జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు కొందరు. క్షణికావేశంలో తాత్కాలిక సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాడు. కుటుంబంలో తలెత్తిన గొడవల కారణంగా ఓ వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అది చూసిన యూట్యూబ్ రిపోర్టర్ ఆమెకు రక్షించాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
భర్త కోపగించుకున్నాడని..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి ప్రాంతానికి చెందిన తన్నీరు శ్రీనివాస్, పద్మ దంపతులు. ఉపాధి కోసం హైదరాబాద్ కు 15ఏళ్ల కిందట వలస వచ్చారు. నగర శివారులోని సూరారం కాలనీలోని ముత్యాలబస్తీలో నివసిస్తున్నారు. వీరికి 15సంవత్సరాల వయసు గల కూతురు ఉంది. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఏదో విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఆవేశంలో పద్మను శ్రీనివాస్ కోప్పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన పద్మ ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సూరారం కట్టమైసమ్మ ఆలయం ముందున్న లింగంచెరువు వద్దకు చేరుకుని అందులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె చెరువులోకి దూకుతుండగా అప్పటికే అక్కడ ఉన్న వారు పద్మను రక్షించకపోగా.. వీడియోలు చిత్రీకరిస్తున్నారు.
ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ.. కాపాడిన రిపోర్టర్
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2024
హైదరాబాద్ - సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. అప్పుడే అక్కడకు చేరుకున్న రిపోర్టర్ పల్నాటి శివకుమార్ తాడు సాయంతో ఆ మహిళను ఓడ్డుకు చేర్చాడు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి… pic.twitter.com/NfSF5fPmts
ధైర్యం చేసి మహిళను కాపాడిన రిపోర్టర్
ఆ సమయంలోనే న్యూస్ కవరేజీ కోసం అక్కడకు చేరుకున్న ఓ న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పల్నాటి శివకుమార్ ప్రాణాలకు తెగించి తాడు సహాయంతో చెరువులోకి దిగి మహిళను కాపాడాడు. ఈ లోగా సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు తన కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించారు. కాగా రిపోర్టర్ పల్నాటి శివకుమార్ పద్మ ప్రాణాలను కాపాడడం పట్ల అభినందించారు.