Youngman Suicide: యువకుడి ఆత్మహత్య.. ఆ 26 లక్షల రూపాయలే కారణమా?
Youngman Suicide: పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. తాను పనిచేస్తున్న సంస్థలోని పాతిక లక్షల రూపాయలు సొంత ఖర్చులకు వాడుకున్నాడు. చివరకు తాను పనిచేసే చోటనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేమైందంటే?
Youngman Suicide: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ రోడ్డులో గల విశాల పరపతి సంఘం భవన సముదాయ షెటర్ లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడే తాత్కాలిక ఉద్యోగిగా పని చేసే కొప్పు వినయ్ అనే పాతికేళ్ల అబ్బాయి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ కొడుకు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులే అతను పని చేసే చోటుకు వచ్చి చూసి షాక్ కి గురయ్యారు. చనిపోయింది మా కుమారుడే అని... తమది అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామమని స్థానికులకు వివరించారు.
అసలేమైందంటే..?
మృతుడు వినయ్ గత 7 సంవత్సరాలుగా హుస్నాబాద్ లోని విశాల పరపతి సంఘంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నిన్న ఉదయమే ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చిన వినయ్ తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. చాలా సేపటి వరకు తమ కుమారుడు రాకపోయేసరికి అతడి స్నేహితులందరినీ అడిగారు. ఎవరికీ ఏం తెలియదని చెప్పడంతో భయపడి... అతను పని చేసే చోటుకు వెళ్లారు. సొసైటీ ఎరువుల గోదాం వద్దకు వెళ్లి షెటర్ తలుపులు తీశారు. ఫ్యాన్ కు వేలాడుతూ తమ కొడుకు కనిపించే సరికి అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు.
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు..
ఓ వైపు బోరుమని ఏడుస్తూనే... బంధువులకు, కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే తమ కుమారుడిది ఆత్మహత్య కాదని... కావాలనే కొందరు హత్య చేశారంటూ మృతుడి తండ్రి కొప్పు బాబూరావు చెబుతున్నారు. తమ కుమారుడి మృతికి హుస్నాబాద్ ప్యాక్స్ చైర్మన్, వైస్ చైర్మన్, ఓ ఉద్యోగే కారణమని ఆరోపిస్తూ వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. వినయ్ ను కావాలని హత్య చేసి తప్పించుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాపోతున్నారు.
మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. వినయ్ ది హత్యా లేక ఆత్మహత్య అన్న విషయం త్వరగా కన్నుకోవాలంటూ పోలీసులను కోరారు. ఒకవేళ వినయ్ ది హత్య అని తెలిస్తే... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా ప్రాణం లేకుండా ఉండడం చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకే దగ్గరుండి తమకు కర్మకాండలు చేస్తాడనుకుంటే కొడుక్కే తాము చేయాల్సి వస్తుందంటూ విలపించారు.
ఆ 26 లక్షలే కారణమా..!
అయితే విశాల పరపతి సంఘంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న మృతుడు వినయ్... సంఘంలోని 26 లక్షల రూపాయలను సొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి వాటిని చెల్లించే విషయంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.