Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఓ చోట భార్య సూసైడ్ కు భర్తే కారణమని హత్య, మరో చోట ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
Nagarkurnool Suicide Case: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు జరిగాయి. తెలంగాణలో మహిళ ఆత్మహత్యకు భర్తే కారణమని బంధువులు ఆమె భర్తను కొట్టి చంపగా.. ఏపీలో స్థలం కోసం భర్తను భార్య చంపింది.
Wife Suicide Relatives Murdered Her Husband in Nagarkurnool: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడగా.. అందుకు భర్తే కారణమని భావించిన ఆమె బంధువులు అతన్ని హత్య చేశారు. ఏపీలో ఓ మహిళ 10 సెంట్ల స్థలం కోసం తన భర్తనే అంతమొందించింది. ఈ 2 ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా లింగాల (Lingala) మండలం చెన్నంపల్లికి చెందిన సింధు, అచ్చంపేటకు చెందిన నాగార్జున మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరిగాయి. దీంతో సింధు అచ్చంపేటలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సింధు మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో నాగార్జున మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అతన్ని సింధు కుటుంబ సభ్యులే కొట్టి చంపారని నాగార్జున కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'వారే చంపారు'
సింధు మృతదేహాన్ని అచ్చంపేటకు అంబులెన్సులో తెచ్చే క్రమంలో అమనగల్లు సమీపంలోకి రాగానే నాగార్జునను దింపేశారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సింధు మృతదేహాన్ని వేరే కారులో తరలించి.. కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు. నాగార్జున ఆచూకీ లభ్యం కాక తాము పోలీసులను ఆశ్రయించామని.. తీరా శవమై కనిపించాడని కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని.. తన సోదరున్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నాగార్జున సోదరి డిమాండ్ చేశారు.
'మా కూతురిని వేధించారు'
మరోవైపు, తన కుమార్తెను కట్నం కోసం నాగార్జున కుటుంబ సభ్యులు వేధించారని.. సింధును హత్య చేసి ఆత్మహత్యయత్నం పేరుతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. 'నా కూతురు తన బాధను నాతో చెప్పుకొంది. అతన్ని వదిలి వచ్చేయాలని తనతో చెప్పాను. కానీ వాళ్లు నా బిడ్డ ప్రాణం తీశారు. మాకు న్యాయం చేయాలి'. అంటూ సింధు తల్లి ఆరోపించారు. అయితే, పూర్తి స్థాయి విచారణలోనే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో భర్తను చంపిన భార్య
అటు, ఏపీలోనూ దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తనే హత్య చేసింది. అనకాపల్లి (Anakapally) జిల్లా కశింకోట (Kasimkota) మండలం బయ్యవరం గ్రామంలో 10 సెంట్ల స్థలం కోసం వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. స్థలాన్ని అమ్మాలని గత కొంత కాలంగా భర్తపై ఒత్తిడి చేసింది. అందుకు అతను ససేమిరా అనడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భర్త తాగే మద్యంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది. అది తాగిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు భార్య శివలక్ష్మిపై సెక్షన్ 302, 201గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.