Crime News: అత్త చెవి కొరికేసిన కోడలు - అతికించలేమన్న వైద్యులు, గుంటూరు జిల్లాలో దారుణం
Guntur News: కుటుంబ కలహాలతో ఓ కోడలు తన అత్త చెవి కొరికేసిన ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగింది. అయితే, తెగిన చెవిని అతికించలేమని వైద్యులు తెలిపారు.
Woman Bites Her Mother In Law In Thullur: కుటుంబ కలహాలు.. అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే, ఆ గొడవలు శ్రుతి మించితేనే ప్రమాదం. గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన అత్త చెవి కొరికేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుళ్లూరులో కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్ది రోజులుగా పావని.. అత్త నాగమణికి (55) కుటుంబ కలహాలతో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి గొడవ జరగ్గా.. ఆ సమయంలో కోడలు కోపంతో క్షణికావేశంలో అత్త చెవి కొరికేసింది. దీంతో అత్త చెవి భాగం మొత్తం ఊడిపోయింది.
స్థానికులు ఆమెను, తెగిన చెవిని వెంటనే తుళ్లూరు పీహెచ్సీకి.. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యమైందని.. తెగిన చెవిని అతికించడం కష్టమని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.