Medico Preeti Case : ప్రీతి కేసు సంచలన మలుపు - బాడీలో డిటెక్ట్ కాని విషపదార్థాలు ! అనుమానాస్పద మృతిగా కేసు మార్చే అవకాశం ?
మెడికో ప్రీతి మృతి కేసు టాక్సికాలజీ రిపోర్టుతో సంచలన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Medico Preeti Case : మెడికో ప్రీతి మరణం కేసు సంచలన మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్సికాలజీ రిపోర్టులో అసలు ప్రీతి బాడీలో విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని తేలింది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో విషపదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ పేర్కొంది. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. సూసైడ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేపనిలో పోలీసులు ఉన్నారని, హత్యే అని ప్రీతి కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటి వరకూ అనస్థీషియా తీసుకుని ఆత్మాహత్యయత్నం చేసిందని ప్రచారం
ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఇప్పటి వరకూ అనుకున్నారు. ఆమె అనస్థీషయా తీసుకుందని చెప్పుకున్నారు. కానీ అసలు అలాంటి ఆనవాళ్లు కూడా లేవని టాక్సికాలజీ రిపోర్టులో బయటపడటం సంచలనం అవుతోంది. ఆమెకు మొదట పీసీఆర్ చేసి.. ఆతర్వాత నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ కు తీసుకు వచ్చేటప్పటికే పరిస్థితి విషమంగా ఉందని ఎక్మో ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఐదు రోజుల తర్వాత వైద్యులు చనిపోయినట్లుగా ప్రకటించారు. ప్రీతి.. సైఫ్ అనే సీనియర్ డాక్టర్ వేధింపుల వల్లే చనిపోయిందని .. సైఫ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆత్మహత్య కాదని.. శరీరంలో విష రసాయనాలేమీ లేవని తేలడంతో ఏం చేయాలన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఇప్పటి వరకూ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నమని విచారణ
ఇప్పటి వరకూ ఆత్మహత్య కోణంలోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీతి కేసు విషయమై తెలంగాణ డీజీపీ ఆఫీసుకు ప్రీతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రతీ కేసు గురించి డీజీపీ అంజనీ కుమార్ తో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రతీ తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యేనని కామెంట్ చేశారు. టాక్సికాలజీ రిపోర్టు తమకు ఇవ్వలేదని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే బ్లడ్ ఎక్కించిన తర్వాత శాంపుల్స్ ను టాక్సికాలజీ కోసం పంపించారని... ఇప్పటికే డయాలసిస్ కూడా పూర్తయిందని అన్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు మారుస్తారా ?
తమ కూతురిని సైఫ్ హత్య చేశాడని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తండ్రి చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు కూడా పంపామన్నారు. ప్రీతికి ఇంజెక్షన్ తీసుకుని చనిపోయిందనుకుని సైఫ్ వెళ్లాడని, అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించినట్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులో వివరాలన్నీ ఉండే అవకాశముందని చెబుతున్నారు పోలీసులు. ప్రీతి ఆత్మహత్య కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఒత్తిడితోనే ప్రీతి చనిపోయినట్లు కాలేజీ యాజమాన్యం చెప్పగా.. ఆ తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళనలతో సైఫ్ వేధింపుల వల్ల చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.