Crime News: హైదరాబాద్‌లో మర్డర్, కర్ణాటకలో కాల్చేసింది - ప్రియుడితో కలిసి మూడోభర్తను చంపేసింది, ఆస్తి కోసం దారుణం
Hyderabad News: ఓ మహిళ ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కడతేర్చింది. హైదరాబాద్‌లో చంపేసి మృతదేహాన్ని బెంగుళూరులో ముక్కలుగా నరికేసి కాల్చేశారు. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Wife Murdered Her Husband In Hyderabad: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి మూడో భర్తను హతమార్చింది. హైదరాబాద్‌లో (Hyderabad) చంపేసి కర్ణాటకలో మృతదేహాన్ని ప్రియుడి సాయంతో కాల్చేసింది. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన నిహారిక (29) వరుసగా బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హరియాణాకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చింది. రెండో భర్త పెట్టిన కేసులో జైలుకు వెళ్లగా.. ఆమెకు మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది. అనంతరం బెంగుళూరుకు మకాం మార్చింది.
స్థిరాస్తి వ్యాపారిని..
అనంతరం మ్యాట్రిమోనీ వేదిక ద్వారా హైదరాబాద్ తుకారాంగేట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది. రమేశ్‌కు అప్పటికే భార్య, కుమార్తె ఉన్నారు. అయినా ఇద్దరూ 2018లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఘట్‌కేసర్ పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో కాపురం పెట్టారు. ఉద్యోగం పేరిట నిహారిక బెంగుళూరుకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో నిహారిక ఈ నెల 4వ తేదీన పోచారానికి రాగా.. అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేశ్ కుమార్ గొడవపడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిహారిక.. రాణాను వెంటబెట్టుకొని తిరిగివచ్చింది. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. రాత్రి 11 గంటల సమయంలో కారులో బయటకు వెళ్లారు. రమేశ్ కుమార్ హత్యకు పక్కాగా ప్లాన్ చేశారు.
నిహారిక, రాణాలు మేడిపల్లి ఠాణా పరిధి పీర్జాదిగూడ కమాన్ వద్ద రమేశ్‌ను కారులోనే కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని ఆమె బెంగుళూరులోని మరో ప్రియుడు నిఖిల్ రెడ్డికి చెప్పింది. అతడి సూచనతో మృతదేహాన్ని కారులోనే కర్ణాటకలోని కొడుగు జిల్లా సుంటికుప్ప ప్రాంతానికి తరలించారు. అక్కడ ఓ కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. అక్కడే కాల్చేసి పరారయ్యారు. 8వ తేదీన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాఫీ తోట, చుట్టుపక్కల ప్రాంతాల్లో 500 సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలో నమోదైన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. రమేశ్ పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తిని కాజేసేందుకే హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. కేసును మేడిపల్లి ఠాణాకు బదిలీ చేయనున్నారు.
మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య
మరో ఘటనలో, ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పుల్కల్ గ్రామానికి చెందిన యువతి, మునిపల్లి మండలం మూలపాడు గ్రామానికి చెందిన రంజిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి యువతి బర్త్ డే ఉండడంతో రంజిత్ పుల్కల్ వెళ్లి యువతిని కలిశాడు. దీన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆగ్రహంతో రంజిత్‌పై దాడి చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక రంజిత్ సింగూర్ బ్యాక్ వాటర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.