Vizianagaram Crime : ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య, మర్డర్ చేసి యాక్సిడెంట్ గా నాటకం!
Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో ప్రియుడి మోజులో మహిళ భర్తను హత్య చేసింది. ఈ మర్డర్ ప్లాన్ లో ప్రియుడితో పాటు తన కొడుకుని భాగం చేసింది.
Vizianagaram Crime : వివాహేతర సంబంధాలు దారుణానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయింది. ప్రియుడి మోజులో పడిన మహిళ భర్తను కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుంది. తమ ప్రేమాయణానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హతమార్చింది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో తన కొడుకుని కూడా భాగం చేసింది. దారుణంగా హత్య చేసి ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికేశారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలో నివసిస్తున్న సింగంపల్లి రాముకు భార్య తులసి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జులై 12వ తేదీన కొటారుబిల్లి వద్ద యాక్సిడెంట్ లో రాము చనిపోయాడు. రోడ్డు పక్కన రాము మృతదేహాన్ని గమనించిన స్థానికులు అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు.
బంధువుల అనుమానం
అయితే ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లిన రాము కుటుంబ సభ్యులు అతడి వాహనం ఒక చోట, మృతదేహం మరొకచోట పడిఉండటాన్ని గమనించి పోలీసులు ఫిర్యాదు చేశారు. రాము తలపై బలమైన గాయాలుండటంతో రోడ్డు ప్రమాదం కాదని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు ఇది ప్రమాదం కాదని హత్య అని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది?
రాము భార్య తులసీ సన్యాసినాయుడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం రాముకు తెలిసిపోయింది. భార్యను పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. ప్రియుడి మోజులో పడిన తులసీ తన బంధానికి భర్త అడ్డుతగులుతున్నాడని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ప్రియుడు సన్యాసినాయుడుకు చెప్పింది. ఇద్దరూ కలిసి రాము హత్యకు ప్లాన్ వేశారు. రాము కుమారుడికి తండ్రిపై లేనిపోని మాటలు చెప్పి, అతడికి వ్యతిరేకంగా మార్చింది. తల్లి చెప్పిన మాట నమ్మిన బాలుడు తనకు కడుపు నొప్పిగా ఉందని డ్రామా ఆడాడు. దీంతో రాము కొడుకును తీసుకొని విజయనగరం ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రిలో చూపించి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు బహిర్భూమికి వెళ్లాలని తులసీ చెప్పిన ప్లాన్ ప్రకారం బైక్ ఆపించాడు. అప్పటికే అక్కడ కాపుగాసిన తులసీ, ఆమె ప్రియుడు భర్తపై దాడి చేసి హత్య చేశారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాము మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో నిందితులు అసలు నిజం బయటపెట్టారు. దీంతో పోలీసులు తులసీ, సన్యాసినాయుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.