Jaahnavi Kandula: అమెరికాలో జాహ్నవి కందుల మృతి - ఆ పోలీస్ అధికారి ఉద్యోగం ఊస్ట్
Andhrapradesh News: అమెరికాలో కర్నూలు యువతి కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన పోలీస్ అధికారిపై వేటు పడింది. ఆయన్ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు.
US Cop Lost His Job In Kurnool Young Woman Death Issue: గతేడాది అమెరికాలో కర్నూలు జిల్లాకు చెందిన యువతి జాహ్నవి కందుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిని చులకనగా చేస్తూ మాట్లాడిన పోలీస్ అధికారిపై అక్కడి ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. డేనియల్ అడెరెర్ అనే పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విషాద సమయంలో ఆయన మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే.?
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. గతేడాది జనవరిలో సియాటెల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తుపై డేనియల్ అడెరెర్ అనే పోలీస్ అధికారి యువతి మృతి పట్ల చులకనగా మాట్లాడాడు. 'ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువ లేదు.' అన్నట్లుగా ఆయన మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. అంతే కాకుండా ఆయన పగలబడి నవ్వడం కూడా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సదరు అధికారిని అప్పట్లోనే సస్పెండ్ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు చేపట్టారు.
'పోలీస్ వృత్తికే సిగ్గుచేటు'
కందుల జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి అడెరెర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రహర్ తెలిపారు. ఆయన మాటలు సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ తెచ్చాయని పేర్కొన్నారు. అడెరెర్ వ్యాఖ్యలు పోలీస్ వృత్తికే సిగ్గుచేటని.. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని అన్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో అడెరెర్‌ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని.. అందుకే ఆయన్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.