Crime News: తిరుపతి జిల్లాలో దారుణాలు - బిస్కెట్ల ఆశ చూపి 8 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం, మరో చోట ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం
Andhrapradesh News: నంద్యాల, విజయనగరం జిల్లాలో దారుణాలు మరువక ముందే తిరుపతి జిల్లాలో మరో దారుణం కలకలం రేపింది. 8 ఏళ్ల చిన్నారికి బిస్కెట్లు ఆశ చూపిన నిందితుడు అత్యాచారం చేసి హతమార్చాడు.
Minor Abused And Murdered In Tirupati: నంద్యాలలో (Nandyal) ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం, విజయనగరం (Vijayanagaram) జిల్లాలో పసికందుపై వృద్ధుడి అత్యాచార ఘటనలు మరువక ముందే తిరుపతిలో మరో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదేళ్ల చిన్నారికి బిస్కెట్లు ఆశ చూపిన మానవ మృగాడు అత్యాచారం చేసి చంపేశాడు. ఈ అమానుష ఘటన తిరుపతి (Tirupati) జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో పని చేస్తోన్న భార్యాభర్తల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పని చేస్తోన్న బీహార్‌కు చెందిన ఓ యువకుడు (20) బిస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపి ఉదయం తీసుకెళ్లాడు.
అటవీ ప్రాంతంలో మృతదేహం
బుధవారం మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు పాప కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై స్థానికులతో కలిసి వెతుకులాట ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు చిన్నారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గంజాయి మత్తులోనే..
నిందితుడు చిన్నారిని తీసుకెళ్లడం సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనేందుకు తీసుకెళ్లానని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. గంజాయి మత్తులోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నిందితుడు బాలిక తండ్రితో గంజాయి మత్తులో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే ఇలా చేశాడా.? అనే కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థినిపై..
మరోవైపు, ఇదే తిరుపతి జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై దారుణం జరిగింది. వినయ్ అనే రౌడీ షీటర్ విద్యార్థినిని కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన బాధిత విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యాయత్నం..
అటు, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. మోతాదుకు మించి మందులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు సిబ్బంది విషయం చెప్పగా.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీశారు.
Also Read: Tirumala News: తిరుమలలో కల్తీ ఆహారం- అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన సంచలన వాస్తవాలు