Man Attack: బంగారం మెడలో వేస్కొని వాకింగ్, సీన్ కట్ చేస్తే ఆస్పత్రిలో, ఏమైందంటే!
Gold Theft: మెడలో బంగారం వేస్కొని వాకింగ్ వెళ్లిన ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాడ్డుతో తలపై కొట్టారు. ఆయన కేకలు విని స్థానికులు రావడంతో.. నిందితులందరూ పరారయ్యారు. అసలేమైందంటే?
Gold Theft: వాకింగ్ చేసేందుకు తెల్లవారు జామున 4 గంటలకు బైపాస్ రోడ్డుకు వెళ్లాడు. రోజూలానే తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ముఖానికి ముసుగులు ధరించిన నలుగురు ఓ కారులో వచ్చారు. వచ్చిందే తడవుగా దాడికి పాల్పడ్డారు. వ్యాపారవేత్త అయిన ఈవ్యక్తిని ఎందుకు వారు టార్గెట్ చేశారు..? వంటి మీద బాగా బంగారు వస్తువులు ధరించే ఆ వస్తువుల కోసమా.. లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా.. అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే బాధితుని గురించి బాగా తెలిసిన వాళ్లను విచారించగా.. ఆయన చాలా బంగారు వస్తువులు వేసుకుంటాడని, చేతికి బంగారు కడియం, మెడలో వస్తువులు ఇలా చాలానే వేసుకుంటాడని చెబుతున్నారు. అయితే దొంగలు బంగారం కోసమే దాడికి పాల్పడి ఉండవచ్చని అంటున్నారు.
ముఖానికి మాస్కులతో వచ్చి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ముమ్మిడివరం నియోజకవర్గం క్రాప చింతల పూడికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామునే దాడికి పాల్పడ్డారు. అయితే ఆ వ్యక్తి కూడా తిరగబడి దాడి చేశారు. గట్టి గట్టిగా అరవడంతో అప్రమత్తమైన స్థానికులు పరుగెత్తుకొచ్చారు. దాదాపు పది మంది వరకు రావడం గమనించిన దుండగలులు పరారయ్యారు. అయితే నిందితులు అక్కడకు కార్లో వచ్చారని వారంతా నల్ల డ్రన్లు ధరించి, ముఖానికి మాస్కులు కూడా పెట్టుకొని వచ్చారని బాధితుడు చెబుతున్నాడు.
వాకింగ్ చేస్తుండగా దాడి, స్థానికుల రాకతో దొంగల పరార్..!
క్రాప చింతలపూడిపాలెం గ్రామ పరిధిలో తెల్లవారు జామున 4 గంటల సమయంలో గ్రామానికి చెందిన వ్యాపారస్తుడు సానబోయిన శివన్నారాయణ వాకింగ్ కు వెళ్లాడు. అయితే రోజూ లాగానే శనివారం వేకువ జామునే సైకిల్ పై వాకింగ్ కు బయలు దేరాడు. మధ్యలో సైకిల్ పక్కన పెట్టి నడస్తున్నాడు. అంతలోనే ఓ కారుపై నలుగురు వ్యక్తులు వచ్చి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. తేరుకుని దాడికి పాల్పడుతున్న వ్యక్తులపై తిరగబడి ఎదురు దాడి చేస్తుండగా వారు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో శివన్నారాయణను కొట్టారు. ఇంతలో అతని ఒంటిపైనున్న వస్తువులను లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా ఇతని కేకలతో చుట్టు పక్కల వారు రావడంతో అతన్ని వదిలి అక్కడి నుంచి వచ్చిన కారులోనే పారిపోయారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివన్నారాయణ..!
అయితే ఈ సంఘటనలో బాధితునికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడినిముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివన్నారాయణతో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుకుసున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏవైనా కక్షల వల్లే వాళ్లు దాడి చేశారు, లేక బంగారం కోసం దాడి చేశారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివన్నారాయణ పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.