Software Engineers Death: మద్యం సేవించేందుకు వెళ్లిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి, అన్నమయ్య జిల్లాలో విషాదం
Annamayya District | మద్యం సేవించేందుకు వెళ్లిన ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో ఈ ఘటన జరిగింది.

కంభంవారిపల్లె: అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సెలవుల కోసం తమ స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మద్యం సేవించడానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బండవంటిపల్లె గ్రామానికి చెందిన మణి (35), పుష్పరాజ్ (27) అనే ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం మరో నలుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి ఊరి బయటకు వెళ్లారు.
మద్యం సేవిస్తున్న క్రమంలో కొంత సమయానికి మణి, పుష్పరాజ్ ఇద్దరూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్నేహితులు వారిని వెంటనే పీలేరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మణి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యంగ్ టెకీల మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
పండుగ సమయాల్లో కొన్నిచోట్ల ఇలాంటి ఘటనలు..
పండుగ సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో లభించే మద్యం నాణ్యతపై తరచుగా ఆరోపణలు వస్తుంటాయి. కల్తీ మద్యం (Spurious Liquor) వల్ల శరీరంలోని అవయవాలు విఫలమై క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అనుమానాస్పద మృతి కేసుల్లో మరణానికి అసలు కారణం (విష ప్రయోగం జరిగిందా లేదా ఇతర ఆరోగ్య సమస్యలా అనేది) కేవలం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల ద్వారానే వెల్లడవుతుంది. సెలవులకు గ్రామాలకు వెళ్లే యువత, ఉత్సాహంలో తెలియని వ్యక్తులు విక్రయించే మద్యం లేదా నాణ్యత లేని పదార్థాలను సేవించడం వల్ల ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరుగుతుంటాయి.





















