Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్ షాక్‌తో నలుగురు మృతి
Tragedy at Pedakakani Goshala in Guntur | గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో గోశాలలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.

అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ కాళీవన ఆశ్రమం గోశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో పనికోసం వచ్చిన ముగ్గురు కార్మికులు, ఒకరు ఆశ్రమంలో ఉండే వ్యక్తి ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
శ్రీ కాళీవన ఆశ్రమం గోశాలలో పేడ, వ్యర్థాలను సేకరించి సంపుల్లో వేస్తుంటారు. అవసరం ఉన్నప్పుడు గోవుల వ్యర్ధాలను తరచుగా మోటర్ ద్వారా బయటికి పంపిస్తారు. ఎప్పుడైనా సంపుల్లో పేడ గట్టిపడితే వైబ్రేటర్ సాయంతో కలియబెడుతుంటారు. ఇలా రెండు, మూడు రోజులకు ఓసారి ప్రక్రియ జరుగుతుంటుంది. ఈ క్రమంలో తెనాలికి సమీపంలోని చినరావూరు గ్రామానికి చెందిన గందాళ మహంకాళిరావు అనే 28 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 24న సాయంత్రం వైబ్రేటర్ మెషీన్‌తో సంపులోకి దిగాడు. కానీ వైబ్రేటర్ విద్యుత్తు తీగ తెగడంతో మహంకాళిరావు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

సంపులోంచి మహంకాళి రావు కేకలు వేయడంతో అది విన్న రాజేశ్ అనే 20 ఏళ్ల యువకుడు సంపులోకి దిగి మహంకాళి రావును పట్టుకోవడంతో అతడు సైతం విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వీరి తరువాత ఏటగిరి బాలయ్య (35), అక్కడే ఆశ్రమంలో పని చేస్తున్న శివరామకాళిబాబు (50) ఒకరి తరువాత ఒకరు సంపులోకి దిగారు. కరెంట్ షాక్ కొట్టడంతో వీరు కూడా స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగిన వారు ఎంతకూ పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి జీవన్ బాబు అనే వ్యక్తి కరెంట్ సరఫరా ఆఫ్ చేశాడు.
తీగ తెగడంతో కరెంట్ షాక్..
ఆశ్రమం నుంచి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సంపు నుంచి మృతదేహాలను పైకి తీశారు. వైబ్రేటర్ కరెంట్ తీగ తెగడంతో షాక్ కొట్టి ప్రమాదం జరిగిందని తేల్చారు. ప్రశాంతంగా ఉండే ఆశ్రమంలో నలుగురు వ్యక్తులు చనిపోవడంతో విషాదం నెలకొంది. పనికోసం వచ్చి ముగ్గురు చనిపోవడంతో మాకు ఇక దిక్కెవరు అంటూ వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఘటన కావడంతో గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎమ్మార్వో కృష్ణకాంత్ ఆశ్రమానికి వెళ్లి పరిశీలించారు. ఆశ్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. విద్యుత్ తీగ తెగినట్లు గుర్తించి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు.






















