Tirupati Crime News: వకుళామాత ఆలయంలో అర్ధరాత్రి చోరి - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
Tirupati Crime News: తిరుపతికి సమీపంలోని వకుళామాత ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీని పగులగొట్టి అందులోని డబ్బులన్నింటనీ మూటగట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ మూట కిందపడిపోయింది.
Tirupati Crime News: తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వకుళమాత ఆలయంలో గత రాత్రి చోరీకి జరిగింది. ఆలయం వెనుక వైపు కొండ ఎక్కి లోనికి ప్రవేశించిన దుండగుడు గడ్డ పారతో హుండీ తాళాలు పగులగొట్టాడు.. హుండీలోని నగదును మూటగట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలోనే మూట కిందపడిపోయింది. అలికిడి కావడంతో దొంగ పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం గుర్తించిన ఆలయ అధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. వేలిముద్రలు సేకరించారు. నగదు మూటను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంకేమైనా వస్తువులు చోరీకి గురయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
నెలన్నర రోజుల క్రితం విజయదుర్గాదేవీ ఆలయంలో చోరీ
విశాఖలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. పోలీసులు అందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదును చూసిన చోరులు చెలరేగిపోయారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గా దేవి ఆలయాన్ని కొల్లగొట్టారు. అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో దుండగులు ఆలయం తాళాలను పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు పుస్తెల తాడు, సూత్రాలతో పాటు హుండీని దొంగిలించారు. దొంగలు బైకు మీద హుండీతో పరారవ్వడాన్ని ఓ స్థానికుడు గమనించి ఆలయ ధర్మకర్తలకు సమాచారం అందించాడు. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొన‌్నారు. పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవాలయాల్లో చోరీలు నిత్యకృత్యంగా మారడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల క్రితం విజయవాడ దుర్గ గుడిలో చోరీ
విజయవాడ దుర్గగుడిలో కూడా ఆరు నెలల క్రితం చోరీ జరిగింది. ఏకంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం సంచలనంగా మారింది. హుండీ లెక్కింపులో ఇలా బంగారం దొంగిలించడం... ఆ బంగారాన్ని బాత్రూమ్‌లో దాచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహా మండపం బాత్రూంలో 12 తులాల బంగారాన్ని ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగు చూసింది.
అంతర్గత విచారణలో భాగంగా అన్ని ప్రాంతాలను చెక్ చేసిన అధికారులు..!
అంతా సజావుగా సాగిందనుకున్న టైంలో పది లక్షల విలువైన బంగారం కనిపించడం లేదని ఆలయాధికారులు గుర్తించారు. మాయమైన బంగారం ఏమై ఉంటుందని అంతా కంగారు పడ్డారు. చివరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి జరిగిన చోరీపై అంతర్గత విచారణ చేపట్టారు. అంతర్గత విచారణలో భాగంగా అన్ని ప్రాంతాలను చెక్ చేశారు. వచ్చిన వారందరిని పిలిచి ఆరా తీశారు. చివరకు పది లక్షల విలువైన బంగారం ఆలయంలోని బాత్ రూంలో గుర్తించారు. అది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు.