Crime News : డోన్‌లో దారి దోపిడీ - రూ. 4 కోట్లు లూటీ ! అసలు ట్విస్ట్ వేరే ఉంది ..
డోన్ లో భారీ దారిదోపిడీ జరిగింది. కానీ బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.
Crime News : నంద్యాల జిల్లాలోని డోన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి భారీ దోపిడీ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న కియా కారును అడ్డగించిన దుండగులు.. రూ.4 కోట్లు నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో ఉన్న వారిని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన దొంగలు.. దోపిడీకి ఉపయోగించిన కియా కారును ఆత్మకూరు సమీపంలో వది లి వెళ్లారు. గత కొన్ని రోజులుగా నంబర్ లేని కారును ఎవరూ తీసుకెళ్లేందుకు రాకపోవడంతో ఆత్మకూరు పోలీసులు కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
అయితే దోపిడీకి గురైన బాధితులు రాతపూర్వకంగా కాకుండా మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. దీంతో డోన్ పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు . బాధితులు గుజరాత్ రాష్ట్రం భావనగర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ దోపిడీపై పోలీసులు, బాధితులు స్పందించడం లేదు. ఏదైనా వ్యాపార లావాదేవీల ప్రకారం ఈ దారి దోపిడీ జరిగిందా లేకపోతే.. లెక్కల్లో లేని సొమ్ము కాబట్టి.. ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ అంశంపై అధికారికంగా స్పందించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.
నెంబర్ లేని కియా కారు మాత్రమే ప్రస్తుతం ఈ కేసులో సాక్ష్యంగా ఉంది. ఆ కారులో రూ. నాలుగు కోట్లు తరలిస్తున్నారని తెలిసిన వారే ఇలా దోపిడీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కారు గురించి పోలీసులకు తెలిసే వరకూ.. వాటికి సంబంధించిన మనుషుల్ని పిలిపించే వరకూ బాధితులు పోలీసుల వద్దరు కావడానికి ఆసక్తి చూపించలేదు. ఈ కేసు పోలీసులకు కూడా మిస్టరీగానే మారింది. డబ్బులు దోపిడీ చేసింది లోకల్ ముఠాలు అయి ఉండవని.. అంతర్రాష్ట్ర ముఠాలే అయి ఉంటాయని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కొన్ని క్లూలు ఇచ్చారని.. వాటి ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఫిర్యాదు ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బహుశా అది బ్లాక్ మనీ అయి ఉండవచ్చుని.. ఆరా తీస్తే..ఆ డబ్బు యజమాని ఎవరో బయటకు తెలుస్తుంది కాబట్టి సైలెంట్ గా ఉండటం బెటరని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా డబ్బు పోయిందని చెబుతున్నారు కానీ.. రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం లేదు.