అమ్మతో ఫోన్ మాట్లాడుతూ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని, అసలేం జరిగింది ?
Student Suicide: గుంటూరులోని కొరిటెపాడులో ఇంజినీర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ భవనం పైనుండి దూకి ప్రాణాలు తీసుకుంది.
Student Suicide: క్షణికావేశం ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా యువత, ఆవేశంలో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో కొన్ని ఏకంగా ప్రాణాల మీదకు తీసుకువస్తాయి. మరికొన్ని ఏకంగా ప్రాణాలనే తీసేస్తున్న ఘటనలను చూస్తున్నాం. ఏ చిన్న సమస్య తలెత్తినా.. బాధ వచ్చినా.. వాటికి తట్టుకుని నిలబడేంత మెచ్యూరిటీ వారిలో ఉండదు. ప్రతి చిన్న విషయంపైనా విపరీతంగా రియాక్ట్ అవుతుంటారు. అమ్మ తిట్టిందని, ఫోన్ వాడొద్దందని, గేమ్స్ ఆడద్దొందని, ఫోన్ కొనివ్వలేదని.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కొందరు, మార్కులు తక్కవొచ్చాయని మరికొందరు.. ఇలా ప్రతి చిన్న విషయానికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి కూడా అదే విధంగా బలవన్మరణానికి పాల్పడింది.
అప్పటి వరకు వాళ్ల అమ్మతో ఫోన్ లో మాట్లాడింది. హాస్టల్ భవనం పై ఉండి చెవి దగ్గర ఫోన్ పెట్టుకునే ఉంది. అంతలోనే ఏమైందో ఏమో ఒక్కసారిగా భవనం పైనుంచి దూకేసింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఫోన్ మాట్లాడుతూనే భవనం పైనుంచి దూకేసింది..
గుంటూరు జిల్లా కొరిటెపాడులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్.వి.ఆర్ లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె... ప్రైవేట్ హాస్టల్ లోనే ఉంటూ చదువుకుంటోంది. నూజివీడు మండలం నూరేపల్లికి చెందిన ఈమె అప్పటి వరకూ బాగానే ఉంది. రాత్రి పూట ఫోన్ మాట్లాడేందుకు భవనం పైకి వెళ్లింది. అమ్మతో చాలా సేపే మాట్లాడింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఓవైపు తల్లితో ఫోన్ లో మాట్లాడుతూనే భవనం పైనుంచి దూకింది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు పరిగెత్తి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని కొంత సమయానికే మృతి చెందింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని నిమిషాల కిందటి వరకు తమ స్నేహితురాలు బాగానే ఉందని, ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి వెళ్లిందని అంటున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యంగా, బాధగా ఉందని కామెంట్లు చేశారు.
కూతురు మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
హాస్టల్ నిర్వాహకుల ద్వారా కుటుంబ సభ్యులు విషయాన్ని తెలుసుకున్నారు. అప్పటి వరకూ బాగానే మాట్లాడిన తమ కూతురు ఎందుకిలా ఆత్మహత్య చేసుకుందో తెలియక కన్నీరుమున్నీరయ్యారు. అయినా బలవన్మరణానికి పాల్పడేంత పెద్ద సమస్యలేం లేవని వాపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమ్మ ఏమైనా అంటేనే చనిపోయిందా లేక మరేదైనా విషయమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.