Krishna Crime News : ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన ఫొటోలు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మర్డర్ కేసులో ఇద్దరు అరెస్ట్
Krishna Crime News : కృష్ణా జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మధ్య ఫొటోలు చిచ్చుపెట్టాయి. చివరకు ప్రాణం తీశాయి.
Krishna Crime News : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఆళ్ళవారిపాలెంలో జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సూత్రధారులు ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, మిధునను అరెస్టు చేసినట్లు తోట్లవల్లూరు పోలీసులు వెల్లడించారు. ఇంతకీ శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు హత్య చేశారో తెలుసుకుని పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. మృతుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వీరి స్వగ్రామం ఆళ్ళవారి పాలెం. ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అదే ప్రాంతానికి చెందిన మిధునతో శ్రీకాంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. అయితే ఇటీవల శ్రీకాంత్ రెడ్డి తన ఫోన్ ను ఫార్మాట్ చేసే క్రమంలో శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. అందులో శ్రీకాంత్ రెడ్డి, మిధున ఏకాంతంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసిన శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి మిధునను లొంగదీసుకున్నాడు. ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
మర్డర్ ప్లాన్
శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. స్థానికులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అయితే ఎన్నిసార్లు నచ్చచెప్పినా శ్రీనివాస్ రెడ్డి మిధునను వేధించటం మానుకోలేదు. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ రెడ్డి, మిధునతో కలసి మర్డర్ కు ప్లాన్ వేశాడు. ఎప్పటి లాగానే రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డిపై మిధున, శ్రీకాంత్ రెడ్డి దాడి చేసి కత్తితో నరికి చంపేశారు. రోకలి బండతో తలపై కూడా కొట్టారు.
గ్రామంలో కలకలం
శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ ఆప్తమిత్రులు. గ్రామంలో వీరి స్నేహం గురించి తెలియని వారు లేరు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావటంతో, వీరి స్నేహం మరింత బలపడింది. అయితే మిధున విషయంలో శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని కూడా బెదరింపులకు గురి చేయటం, ఆ తరువాత శ్రీకాంత్ రెడ్డికి దగ్గరయిన మిధునతో, శ్రీనివాస్ రెడ్డి బలవంతంగా సంబంధం పెట్టుకోవటంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతే కాదు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఒకేసారి మహిళ ఇంటికి వెళ్లటం, మిధునను బలవంతం చేయడంతో శ్రీకాంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. దీనికి తోడు శ్రీనివాస్ రెడ్డి తనకు లభించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించటంతో మిధున కూడా శ్రీనివారెడ్డికి పూర్తిగా లొంగిపోయింది. దీంతో శ్రీకాంత్ రెడ్డికి మరింత కోపం పెరిగింది. ఇలానే వదిలేస్తే శ్రీనివాస్ రెడ్డి వేధింపులు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అతన్ని అడ్డుతొలగించుకోవటమే మంచిదని ఇద్దరూ భావించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం మిధున,శ్రీకాంత్ రెడ్డి కలిసి శ్రీనివాస్ రెడ్డిని అంతం చేశారు.
ఫొటో ప్రాణం తీసింది
శ్రీనివాస్ రెడ్డి హత్య జరిగిన సమయంలో మరో రకంగా ప్రచారం జరిగింది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి తమ స్నేహితురాలి ఇంటిలో ఎదురుపడటంతో గొడవ జరిగిందని, ఆ గొడవ కాస్త ఘర్షణగా మారి, శ్రీనివాస్ రెడ్డి హత్య జరిగిందని ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఫొటోను ఆధారంగా చేసుకొని, మిధున, శ్రీకాంత్ రెడ్డి మధ్యలో శ్రీనివాస్ రెడ్డి బలవంతంగా ఎంటర్ అయ్యి, చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న విషయం తెలియటంతో అంతా షాక్ కు గురయ్యారు.