Crime News: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం - లేటుగా వచ్చిందని మందలించిన తల్లి, రైలు కింద పడి బాలిక ఆత్మహత్య
Khammam News: ఖమ్మం జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం జరిగింది. తల్లి మందలించిందని ఓ బాలిక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tenth Class Student Forceful Death In Khammam: ఖమ్మం జిల్లాలో (Khammam District) సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సారధి నగర్ మామిళ్లగూడెంలో నివాసం ఉండే మెడికల్ రిప్రజెంటేటివ్ కుమార్తె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదువుతోంది. కొద్ది రోజులుగా పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో మధ్యాహ్నం వేళ పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాస్తోంది.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం పెన్ను కొనుక్కొని వస్తానని చెప్పి ఇంటికి ఆలస్యంగా రావడంతో బాలిక తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని క్షణికావేశంలో ఇంటి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ భాస్కరరావు, సీఐ అంజలి తెలిపారు.
మరిన్ని ఘటనలు
అటు, మేడ్చల్ జిల్లా (Medchal District) బండమాదారం వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు సోమవారం పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. నిద్రమత్తలో బస్సు నడిపినందు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు, రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మాడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బస్సు డ్రైవర్ మృతి - హైవేపై ట్రాఫిక్ జాం
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీలక్స్ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
కొడుకుపై తండ్రి హత్యాయత్నం
అటు, వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కన్న కొడుకుపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆమెను ఇంటికి రప్పించాలనే ఉద్దేశంతో కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు బాలున్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను చంపేసిన భార్య
మరోవైపు, ఇదే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన భర్తను తలపై కొట్టి హతమార్చింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం