Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
Asha Worker News | హైదరాబాద్‌లో జరిగిన ఆశా వర్కర్ల ఆందోళనను పోలీసులు కట్టడిచేశారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కిస్తుండగా ఓ ఆశా కార్యకర్త సీఐ చెంప చెళ్లుమనిపించారు.
Asha Worker Protest in Hyderabad | హైదరాబాద్: ఆశా కార్యకర్తల ఆందోళనలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. ఓ ఆశా వర్కర్ సీఐ చెంప చెళ్లుమనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం ఆవరణలో పలువురు ఆశావర్కర్లు సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఏడాది గడిచినా తమకు న్యాయం చేయడం లేదని ఆశా కార్యకర్తలు వాపోయారు. ఇచ్చిన హామీని నెరవేర్చుతూ తమకు జీతాలు పెంచాలని ఒక్కసారిగా ఆశా వర్కర్లు ఆందోళనకు దిగడంతో కోటి డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆశా వర్కర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆందోళనకు దిగిన తమకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఏసీపీ శంకర్‌ను ఒక్కసారిగా ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలలోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు వాహనం ఎక్కిస్తున్న సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు. తాను చెయ్యి పెట్టినట్లు గమనించకుండా డోర్ వేయడంతో వెంటనే స్పందించిన ఆ ఆశా వర్కర్ సీఐ చెంప చెళ్లుమనిపించారు. ఇది ఓ అసంకల్పిత ప్రతీకార చర్యగా చెప్పవచ్చు. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు ఆశా వర్కర్ ను కొట్టారు.
మరోవైపు అంతకుముందే మరో పోలీస్ అధికారి ఆశా వర్కర్ చీర పట్టి లాగడం కూడా కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మహిళలతో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా అని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆయనపై చేయి చేసుకుని ఆశా కార్యకర్త హద్దు మీరి ప్రవర్తించారని పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
తల్లికి విగ్రహం అంటూ అక్కాచెల్లెళ్లపై దాడులా? హరీష్ రావు
ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆశా వర్కర్లు న్యాయంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరితే వారిపై పోలీసులు చేసిన దాడుల్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతాం, వారికి ఉద్యోగ భద్రత సైతం కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాలని ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన వారితో ప్రవర్తించడం దుర్మార్గం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మందు ఆశా వర్కర్ల వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, వారి సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10వేలకు పెంచి వారిని గౌరవించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అన్నారు.