Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Telangana News | తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై వివాదం నెలకొంది. అయితే మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు అని రాష్ట్ర ప్రజలు చెక్ చేస్తున్నారు. అప్పటినుంచి జరిగిన మార్పులివే
Telangana Mother Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీటెక్కాయి. నేటి సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొన్నేళ్ల కిందట ఇదేరోజు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాడి పూర్తి కావడం, మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సైతం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది.
తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని కొందరికే తెలుసు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపు తీసుకొచ్చి ఆవిష్కరించారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో 2007 జనవరి 25న విజయశాంతి మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన తొలి నేత తానేనని ఆమె సైతం స్పష్టం చేశారు. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
18 సంవత్సరాల క్రితం 2007లో తెలంగాణ పోరాటాల ఉద్యమకారులం, సమైక్య పాలనలో గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించానని విజయశాంతి పోస్ట్ చేశారు. ఉద్యమ రోజుల్లో ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ, మన తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపం ఇదేనని విజయశాంతి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం ఇలా ఉన్నాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం, మనకు ఎల్లప్పుడూ స్మరణీయం అన్నారు. అమ్మోరు తల్లి లెక్క, నూరు రూపాలైనా, ఏ రూపంలోఉన్నా.. ప్రతి రూపం తెలంగాణ తల్లి ప్రతిరూపమే.... జై తెలంగాణ అని విజయశాంతి మరోసారి నినదించారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మరో రూపునిచ్చింది. రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ ఉండేలా విగ్రహం రూపొందించారు. తెలంగాణ తల్లి ఓ చేతిలో వ్యవసాయానికి సంబంధించి చూపిస్తుండగా, మరో చేతిలో బతుకమ్మను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. మెడలో బంగారు నగలు, తలపై కిరీటంతో నిండుతనం కనిపించేలా చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్ లోనూ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే తీరుగా ఉంటుంది. రాష్ట్రంలోని పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఇలాగే మనకు దర్శనమిస్తాయి.
తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన కాంగ్రెస్
మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంపై నోటిఫికేషన్ ఇవ్వడమో, లేక సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయడమో చేయనందున అధికార కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మూడో రూపం ఇది. నేడు (డిసెంబర్ 9, 2024న) రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహంలో బతుకమ్మను తొలగించారు.
రాష్ట్ర ప్రజలకు అభయహస్తం ఇస్తున్నట్లుగా తల్లి ఓ చేతి చూపిస్తారు. తల్లి మరో చేతిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సూచికగా పంట ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ రూపొందించిన విగ్రహం రూపంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు. తమకు క్రెడిట్ లేకుండా చేసేందుకు బతుకమ్మను సైతం తొలగించారని, అమ్మ తలపై కిరీటం సైతం తీసేసి కాంగ్రెస్ తప్పిదం చేసిందని.. తెలంగాణ తల్లి నిండు రూపంలా లేదని ఆరోపిస్తున్నారు.