Satyasai District Crime : బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఉద్రిక్తత మధ్య రీపోస్టుమార్టం
Satyasai District: సత్యసాయి జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణించిన బీఫార్మసీ విద్యార్థిని మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమయంలో పెనుగొండ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Satyasai District Crime : సత్యసాయి జిల్లా పెనుగొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఫార్మసీ విద్యార్థిని మృతదేహానికి ఉద్రిక్తత మధ్య రీపోస్టుమార్టం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లేపల్లిలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బీఫార్మసీ విద్యార్థి సాధిక్ అనే యువకుడికి గత కొన్ని ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. సాధిక్ ఫోన్ చేయడంతో అతనికి చెందిన తోటకు వెళ్లింది విద్యార్థిని. ఆ తోటలో ఆమె మృతదేహం లభించింది. ముందు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని గురువారం సాయంత్రం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల బృందం పోస్ట్ మార్టం చేసి తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం
మృతురాలి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు సామూహిత అత్యాచారం అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ఇవాళ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థిని మృతదేహాన్ని పెనుగొండలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీంతో అక్కడకి పెద్ద ఎత్తున జనాలు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేయాలని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, వారికి మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
ఉద్రిక్తతల మధ్య మృతదేహం తరలింపు
దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రీపోస్టు మార్టం సమయంలో సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ అక్కడకు వచ్చారు. దీంతో ఆందోళనకారులు ఎస్పీ కారును అడ్డుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రి ప్రాంగణంలోకి తిరిగి వెళ్లాల్సివచ్చింది. సంఘటన వివరాలను వైద్య బృందంతో మీడియాకు తెలియజేశారు ఎస్పీ. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం సామూహిక అత్యాచారం ఆనవాళ్లు లేవని ఆత్మహత్య చేసుకున్నట్టుగానే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల నడుమ మృతురాలికి రీ పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read : B Pharm Student Death: ప్రియుడి తోటలో ప్రియురాలు మృతి, హత్యా? ఆత్మహత్యా?
Also Read : Guntur Murder : బిచ్చగాడితో గొడవ పెట్టుకుని మరీ చంపేశారు ! ఇలాంటి సైకోలు కూడా ఉంటారా?