Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
Man arrested In hoax bomb threat: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పదే పదే పంపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
Software Engineer arrested In hoax bomb threat at Shamshabad Airport: హైదరాబాద్: బెదిరింపులకు పాల్పడి ఆనందించడం గత కొన్నేళ్లుగా కొందరికి ఫ్యాషన్ అయిపోయింది. కొందరు ప్రాంక్ అంటూ అవతలి వ్యక్తులకు గుండెపోటు వచ్చేంత పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పదే పదే బెదిరింపు సందేశాలు పంపుతూ అధికారులతో గేమ్స్ ఆడుతున్న ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పదే పదే పంపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
బెంగళూరులో టెకీ.. ఇక్కడ నిందితుడు
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన వైభవ్ తివారీ బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కరోనా టైమ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వైభవ్ తివారీ జాబ్ కోల్పోయాడు. దాంతో ఆర్థిక సమస్యలు మొదలై, చివరికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక అది మొదలుకుని గత కొంతకాలం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు. దాదాపు వందసార్లు ఇలాంటి ఫేక్ వార్నింగ్ అలర్ట్ మెయిల్స్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. విమానంలో హైజాకర్లు వచ్చారని గతంలో పలుమార్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్స్ చేసి కలకలం రేపాడు. ఫేక్ మెయిల్స్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన ఎయిర్ పోర్టు పోలీసులకు నిందితుడి ఆచూకీ దొరికింది. బెంగళూరుకు చెందిన టెకీ వైభవ్ తివారీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటలకు వైభవ్ తివారీ ఓ మెయిల్ చేశాడు. హైజాకర్ వస్తున్నాడు, మీరు ఎయిర్ పోర్ట్ ఓపెన్ చేయవద్దు అని బెదిరింపు మెయిల్ పంపించాడు. ఆదివారం సైతం నిందితుడు వైభవ్ మరో బెదిరింపు మెయిల్ ఎయిర్ పోర్ట్ అధికారులకు పంపాడు. మీరు బాగా చదివి ఉంటారు కానీ హైజాకింగ్ డిఫెన్స్ తో హత్యలు చేసే వాళ్లుగా మారుతున్నారు అని మెయిల్‌లో రాసుకొచ్చాడు. వివరాలు సేకరించిన ఎయిర్ పోర్ట్ అధికారులు బెంగళూరుకు వెళ్లి టెకీ వైభవ్ తివారీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. 2012 నుంచి 2020 వరకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసినట్లు తెలిపాడు. కోవిడ్ సమయంలో జాబ్ పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఇలాంటి పనులు చేసినట్లు విచారణలో అంగీకరించాడు.