Kolkata Murder Case: బీజేపీ వాళ్లే హాస్పిటల్‌ని ధ్వంసం చేశారు, మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
Kolkata: కోల్‌కత్తాలో హాస్పిటల్‌పై జరిగిన దాడిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇది కచ్చితంగా బీజేపీ కార్యకర్తల పనేనని ఆరోపించారు. హత్యాచారం చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌పై నిరసనకారులు దాడి చేశారు. అద్దాలు, తలుపులతో పాటు అక్కడి పరికరాలనూ ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లలో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హాస్పిటల్‌ని సందర్శించిన గవర్నర్...ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్‌ని కలిశారు. ఆ తరవాత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడి వెనక బీజేపీ ఉందని మండి పడ్డారు. అంతే కాదు. వామపక్షాలపైనా ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీల వాళ్లే హాస్పిటల్‌ని ఇలా ధ్వంసం చేశారని అన్నారు. వీళ్లంతా విద్యార్థులే కాదని, బయటి వ్యక్తులు వచ్చి ఇదంతా చేశారని అన్నారు.
"హాస్పిటల్‌పై దాడి చేసింది ట్రైనీ డాక్టర్లు కాదు. వాళ్లెవరో బయటి వ్యక్తులు. వామపక్షాలు, బీజేపీ పార్టీకి చెందిన వాళ్లు. విద్యార్థులకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఆ పార్టీల జెండాలు కూడా కనిపించాయి. పోలీసులు ఎవరిపైనా ఎలాంటి ఎదురు దాడులు చేయలేదు. మేమూ చాలా సార్లు ఆందోళనలు చేశాం. కానీ ఇలా హాస్పిటల్‌లోకి వెళ్లి ఇంత దారుణంగా విధ్వంసం సృష్టించలేదు. ఏదేమైనా ఈ హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. త్వరలోనే నేను ఈ ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపడతాను. నిందితులను ఉరి తీయాల్సిందే"
- మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "The people who vandalised RG Kar Hospital yesterday and created this ruckus are not connected to the student movement of RG Kar Medical College, they are outsiders, I have seen as many videos, I have three videos as I can… pic.twitter.com/RvrHG7rDdp
— ANI (@ANI) August 15, 2024
ఆగస్టు 14న రాత్రి వేలాది మంది మహిళలు బెంగాల్‌లో రోడ్లపైకి వచ్చి ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై నిరసన వ్యక్తం చేశారు. Reclaim the Night పేరుతో ర్యాలీ చేపట్టారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వరకూ శాంతియుతంగానే నిరసన కొనసాగినా హాస్పిటల్‌లోకి వెళ్లాక ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో నిరసనకారులు హాస్పిటల్‌పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. హాస్పిటల్ బయట ఉన్న పోలీస్ వాహనాలపైనా దాడి చేశారు. దాదాపు 40-50 మంది ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో దాదాపు 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనకారుల ఫొటోలు విడుదల చేసిన కొద్ది గంటల్లోనే వాళ్లను అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ టీమ్ హాస్పిటల్‌కి చేరుకుంది. అక్కడ శాంపిల్స్ సేకరించింది. అయితే..నిరసనకారులు మాత్రం ఎంత మందిని అరెస్ట్ చేసినా ఆందోళనలు ఆగవని తేల్చి చెబుతున్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని అంటున్నారు.