Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Crime : నెల్లూరులో శ్రీ చైతన్య కాలేజీ స్టాఫ్ కి ఇవ్వాల్సిన జీతాల డబ్బుని తీసుకెళ్తున్న అకౌంటెంట్ ని అటకాయించి, పక్కా ప్లాన్ ప్రకారం నగదు బ్యాగ్ ని ఎత్తుకెళ్లిన దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Nellore Crime : ఈనెల 9వ తేదీన నెల్లూరులో ఓ దొంగతనం జరిగింది. శ్రీ చైతన్య కాలేజీలో అకౌంటెండ్ గా పనిచేస్తున్న రవికుమార్ స్టాఫ్ జీతాల సొమ్ము బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని బైక్ పై వెళ్తున్నాడు. అతని బ్యాగ్ లో 8 లక్షల రూపాయల క్యాష్ ఉంది. ప్రతి నెలా ఫస్ట్ వీక్ లో అకౌంటెంట్ బ్యాంక్ కి వెళ్లడం, డబ్బులు డ్రా చేసుకుని రావడం అలవాటు. అయిదే దీన్ని పసిగట్టిన ఓ వ్యక్తి, దొంగల ముఠాతో కలిసి వలపన్నాడు. అకౌంటెంట్ ని బైక్ లపై వెంబడించారు. నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ని ఆపి, అతనిపై దాడి చేశారు. ఒక్కసారిగా ఆరుగురు దొంగలు చుట్టుముట్టడంతో అకౌంటెంట్ భయపడి పోయాడు. ప్రాణ భయంతో పరుగులు తీశాడు. డబ్బుల బ్యాగ్ తీసుకున్న దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆరోజు సాయంత్రం 4.40 గంటలకు దొంగతనం జరిగింది. వెంటనే అకౌంటెంట్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు తనని కత్తితో గాయపరిచారని, రూ.8 లక్షల నగదు కలిగిన బ్యాగ్ తో తన బైక్ పై వెళ్తుండగా అటకాయించి దోపిడీ చేశారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితులు పాత నేరస్థులా అనే కోణంలో విచారణ చేపట్టారు. అకౌంటెంట్ పనితీరుపై నిఘాపెట్టినవారే ఈ దొంగతనం చేసి ఉంటారని పసిగట్టారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
పరారీలో కీలక వ్యక్తి
పనికి పవన్, గుడిమెట్ల హేమంత్ కుమార్, ఆములూరు వెంకట సాయి, గోళ్ళ వీర రాఘవ, గంధళ్ళ వంశీ, షేక్ షారుఖ్ ని అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై దొంగలు వెళ్తుండగా ప్రశాంతి నగర్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.4,43,500/- లక్షల నగదు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలో ఉన్నవారేనని గుర్తించారు పోలీసులు. అయితే ఈ దొంగతనానికి సూత్రధారిగా ఉన్న మరో కీలక వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. అతని డైరక్షన్ లోనే ఈ దొంగతనం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. అతడిని త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు.
కేసు వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి మీడియాకు వివరించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు K. శ్రీకాంత్, B. లక్ష్మణరావు, ముత్తుకూరు ఎస్సై A.శివ కృష్ణా రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు PV. కృష్ణయ్య, వేణుగోపాల్ రావు, భాస్కర్, కానిస్టేబుళ్లు అల్లా బక్షు, మునికృష్ణ, సురేంద్ర రాజుని అభినందించారు డీఎస్పీ హరనాథ్ రెడ్డి. వారికి సర్వీస్ రివార్డ్స్ కోసం సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు.
పట్టించిన సీసీ కెమెరాలు
నెల్లూరులో జరిగిన దొంగతనం కేసుని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు ఛేదించారు. దుండగుల ఆనవాళ్లను పసిగట్టారు, వారు వాడిన బైక్ నెంబర్ల ఆధారంగా కేసు విచారణ మరింత సులభం అయింది. అయితే దొంగతనం తర్వాత వారంతా కొన్నిరోజులపాటు నగరం వదిలి పారిపోయారని, అందరూ దొంగతనం గురించి మరచిపోయి ఉంటారనే ఉద్దేశంతో ఇటీవలే మళ్లీ తమ కార్యకలాపాలు మొదలు పెట్టారని తెలిపారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి, కీలక నిందితుడికోసం గాలింపు మొదలు పెట్టారు.