Munugode By-Elections: మునుగోడుకు తరలిస్తున్న భారీ నగదు పట్టివేత, సొమ్ము బీజేపీ నేతలదేనా?
Munugode By-Elections: మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షలు అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల పట్టుకున్నారు.
Munugode By-Elections: మునుగోడు ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు వాహన తనిఖీలను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా హవాలా నగదు పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. నార్సింగి వద్ద పట్టుబడ్డ కోటి రూపాయల తరలింపు వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధువులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం ఎన్జీవో కాలనీకి చెందిన దేవర్ రాజు, కార్వాన్ కు చెందిన శ్రీకాంత్ సాగర్ వెంకట్ ఫామ్స్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అయితే ఇదే సంస్థలో పని చేసే విజయ్ కుమార్, దేవులపల్లి నగేష్, దాసర్ లూథర్ లు కలిసి రెండు కార్లు, ద్విచక్ర వాహనాల్లో మూడు భాగాలుగా తరలిస్తున్న కోటి రూపాయల నగదు పట్టుబడింది.
అయితే ఈ హవాలా డబ్బులను మునుగోడుకు తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో బయట పడింది. తనిఖీల సమయంలో వాహనాలు ఆపకుండా వెళ్లిపోవడంతో.. పోలీసులు చేజ్ చేసి మరీ వాటిని పట్టుకున్నారు. ఈ సొమ్మును మునుగోడులోని కోమటిరెడ్డి రాజేందర్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సుమంత్ రెడ్డికి అందజేయడానికి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోమటి రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి, సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి, సునీల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కారులో తరలిస్తున్న 64 లక్షల 63 వేలు రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడుకు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేయగా... నగదుతో దొరికిపోయారు. సొమ్ము తీసుకువెళ్తున్న వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్లాలని పోలీసులు వారికి సూచించారు.
గత వారం బీజేపీ నేతల నుంచి కోటి స్వాధీనం..
ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జరుగుతోంది . ఈ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పెద్ద ఎత్తున పార్టీలు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఓటర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారీగా హలాలా డబ్బు పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గంలో ఓ బీజేపీ నేత కారులో కోటి రూపాలయ డబ్బులను గుర్తించారు.
నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉప ఎన్నికల్లో భాగంగా కోటి రూపాయల హవాలా డబ్బును పోలీసులు గుర్తించారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించగా... బీజేపీకి చెందిన ఓ నేత వాహనంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బీజేపీ నేత కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వేణు వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.
పదిహేను రోజుల కిందట మొదలైంది..
గాంధీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంకటేశ్వర్ అనే వ్యక్తి రూ. 3.5 కోట్ల నగదు ఇచ్చాడు. ఆ నగదును సైదాబాద్‌లో ఉండే బాలు, మహేందర్‌కు ఇవ్వాలని సూచించాడు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 3.5 కోట్ల రూపాయల నగదుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గండి సాయికుమార్ రెడ్డి, గుండే మహేశ్, సందీప్ కుమార్, మహేందర్, అనూష్ రెడ్డి, భరత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు ఇచ్చారు వంటి పూర్తి సమాచారం తెలపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.