Fake PMO Officer: ఇతని మోసాలకు ప్రధానమంత్రి కార్యాలయమే షాక్ - ఈ రామారావు జగత్‌కంత్రీ !
CBI: పీఎంవో ఆఫీసులో పని చేస్తానని చెప్పి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై సీబీఐ కేసు పెట్టింది. ఈ మోసగాని గురించి స్వయంగా పీఎంవో దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చింది.

Fake PMO Officer Ramarao: ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధికారిగా తనను తాను చూపించుకుని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల నుంచి వసూళ్లుకు పాల్పడుతూ.. పనులు చేయించుకుంటున్న రామారావు అనే వ్యక్తిపై CBI కేసు నమోదు చేసింది. PMO అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు ఆధారంగా, మోసం, ఫార్జరీలతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు పెట్టాడు. ఈ రామారావు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీలో రాజీందర్ నగర్‌లో నివసిస్తానని చెబుతూ పి. రామారావు అనే వ్యక్తి PMOలో డెప్యూటీ సెక్రటరీగా పరిచయం చేసుకుంటున్నాడు. మరికొన్ని సందర్భాల్లో 'సి. శ్రీధర్' అనే పేరుతో ప్రధాని జాయింట్ సెక్రటరీగా నటించాడు. అతను ఫేక్ PMO లెటర్‌హెడ్‌లపై లేఖలు రాసి, ఫోన్ కాల్స్ చేసి, అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఈ మోసాల్లో మొబైల్ నంబర్ (91973015400) కీలక లింక్‌గా మారింది. ఈ నెంబర్ ను మూడు మోసాలుక ఉపయోగించారు.
తిరుమలలో బయటపడిన మొదటి మోసం
1. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు ఫేక్ సిఫార్సు లేఖ: మే 1, 2025న రామారావు, PMO డెప్యూటీ సెక్రటరీగా నటించి, TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఫేక్ లెటర్‌హెడ్‌పై లేఖ రాశాడు. దీనిలో తాను మే 9న తిరుమలకు వస్తానని, మే 10న సుప్రభాత దర్శనం కోరాడు. అలాగే, తనతో పాటు తొమ్మిది మంది కుటుంబ సభ్యులకు మూడు రోజులు మూడు ఏసీ డబుల్ బెడ్ రూమ్‌లు కేటాయించాలని కోరాడు. TTD అధికారులు ఈ లేఖను PMOకు ధృవీకరణ కోసం పంపారు. అక్కడే అసలు మోసం బయటపడింది.
2. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, పూణేలో అడ్మిషన్ కోసం మోసం : రామారావు, PMO జాయింట్ సెక్రటరీగా పరిచయం చేసుకుని, యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్‌కు ఫోన్ చేశాడు. ఒక విద్యార్థి MBA కోర్సుకు అడ్మిషన్ అత్యవసరం' అని సిఫార్సు చేశాడు. ఈ కాల్‌లోనూ అదే మొబైల్ నంబర్ ఉపయోగించాడు.
3. మైసూరు తహసీల్దార్ కార్యాలయంలో భూమి రికార్డుల కోసం లేఖ : మరో సందర్భంలో 'సి. శ్రీధర్' పేరుతో ప్రధాని జాయింట్ సెక్రటరీగా నటించి, మైసూరు జిల్లా తహసీల్దార్‌కు లేఖ రాశాడు. ఉత్తనహల్లి గ్రామంలో సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్‌కు చెందిన 1,023 ఎకరాల భూమి రికార్డులు రూ. 1,500 కోట్లకు పైగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా సీజ్ చేసినవి కావాలని కోరాడు. ఈ లేఖలోనూ అదే మొబైల్ నంబర్ నమోదు చేశారు.
ఈ మోసాలు PMO దృష్టికి రావడానికి TTD లేఖే కారణం. జూలైలో మొదటి ఫిర్యాదు తర్వాత సింబయాసిస్ కాల్ గురించి మరో ఫిర్యాదు, ఆగస్టు 29న మైసూరు ఘటనపై మూడో ఫిర్యాదు పోలీసులకు అందింది. PMO అసిస్టెంట్ డైరెక్టర్ ఆగస్టు 21న CBIకు వివరణాత్మక ఫిర్యాదు చేశారు. PMOలో 'పి. రామారావు' అనే డెప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని ధృవీకరించారు. మొబైల్ నంబర్ మ్యాచింగ్ ద్వారా అన్ని ఘటనలు ఒకే వ్యక్తికి చెందినవని నిర్ధారణ అయింది.
CBI భారతీయ న్యాయ సంహిత (BNS)లో సెక్షన్ 318(4) (మోసం), 319(2) (పర్సనేషన్), 336(3) (ఫార్జరీ), 340(2) (డిజిటల్ డాక్యుమెంట్ల ఫార్జరీ)లతో పాటు IT చట్టం సెక్షన్ 66-D (కంప్యూటర్ రిసోర్సెస్ ఉపయోగించి మోసం) కింద కేసు నమోదయ్యింది. దర్యాప్తు కొనసాగుతోంది నిందితుడ్ని పట్టుకోవడానికి సీబీఐ వేట ప్రారంభించింది. ఇవి బయటపడినవే అని.. బయటపడకుండా ఇంకెన్ని చేశారోనని సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.




















