Mohith Reddy In Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Chevireddy Mohith Reddy | ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

AP Liquor Scam Case | అమరావతి: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కాం కేసులో ఏ39గా మోహిత్ రెడ్డి ఉన్నారు.
వరుసగా లిక్కర్ కేసు నిందితులకు బెయిల్స్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకూ నలుగురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలతో పాటు దిలీప్‌లకు బెయిల్ వచ్చింది. వారి బెయిల్స్ ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారని, నిబంధనలుక విరుద్ధమని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో A-4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇటీవల సిట్ రెండు రోజుల కస్టడీకి తీసుకుంది. చార్జిషీటు దాఖలు చేయడం.. ఇక కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల మిథున్ రెడ్డికి బెయిల్
లిక్కర్ లిక్కర్ స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ జులై 19, 2025న అరెస్ట్ చేసింది. A4గా FIRలో పేర్కొన్నారు. 2019-2024 మధ్య వైసీపీ హయంలో రూ. 3,500 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, లంచాల సేకరణలో ముఖ్య పాత్ర పోషించారని సిట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. స్కామ్ మాస్టర్ మైండ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో మిథున్ రెడ్డి కలిసి పనిచేశారని సిట్ తెలిపింది.
సెప్టెంబర్ నెలలో పలుచోట్ల ఈడీ దాడులు
లిక్కర్ స్కాం సంబంధించి PMLA, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ, ఏపీలోని ఇరవై ప్రదేశాలలో సెప్టెంబర్ 18న ఈడీ సోదాలు నిర్వహించింది. అక్రమ లావాదేవీల ద్వారా ముడుపుల చెల్లింపునకు దోహదపడిన సంస్థలు, సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. లెక్కల్లో లేని రూ. 38 లక్షల నగదు, వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది.






















