Rajasthan: మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై దారుణ హత్య - ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించిన కోర్టు
Rajasthan News: రాజస్థాన్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరు యువకులకు స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించింది.
Minor Girl Assaulting Case: రాజస్థాన్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులకు స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో ఇద్దరు యువకులు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బతికుండగానే ఇటుకల బట్టీలో పడేసి కాల్చేశారు. కేసుని విచారించిన బిల్వారాలోని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తున్నట్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పునిచ్చే క్రమంలో జడ్జ్ అనిల్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనల్ని అరుదైనవిగా పరిగణించాలని వెల్లడించారు. నిందితులిద్దరూ అన్నదమ్ములు. స్థానికంగా ఓ గిరిజన తెగకి చెందిన వీళ్లిద్దరిపైనా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. అయితే...ఈ కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురుని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. అయితే..వీళ్లని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసుపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహవీర్ సింగ్ ఓ ప్రకటన చేశారు. కోర్టు ఇద్దరినీ దోషులుగా తేల్చిందని, ఉరిశిక్ష వేయాలని ఆదేశించిందని వెల్లడించారు.
గతేడాది ఆగస్టు 3వ తేదీన జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. పశువుల్ని మేపుకుంటూ ఉండగా బాలికపై దాడి చేసిన ఇద్దరు నిందితులూ దారుణంగా అత్యాచారం చేశారు. ఎంత సేపటికీ ఆమె ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. మధ్యాహ్నం అంతా వెతికినా ఎక్కడా జాడ కనిపించ లేదు. చివరకు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇటుకల బట్టీ నుంచి పొగ వస్తుండడాన్ని గమనించారు. అక్కడికి దగ్గర్లోనే బాలిక దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్ సిబ్బంది వచ్చి బాలిక ఎముకలు, సగం కాలిపోయిన శరీరాన్ని వెలికి తీసి ఇన్వెస్టిగేషన్ చేసింది. బతికుండగానే బట్టీలో వేసి కాల్చినట్టు వెల్లడించింది. ఆ సమయంలో ఆమెకి స్పృహ లేదని, కానీ బతికే ఉందని నిర్ధరించింది. అత్యాచారం చేసిన తరవాత తలపై కర్రతో గట్టిగా కొట్టి ఉంటారని చెప్పింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన కోర్టు నిందితులిద్దరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.